Parvathipuram: అప్పారావు కుటుంబ ఆచూకీ దొరికింది!
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:49 AM
తమిళనాట తప్పిపోయిన అప్పారావు కుటుంబ ఆచూకీ లభ్యమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన కొండగొర్రె అప్పారావు 20 ఏళ్ల క్రితం..

20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం వెళ్లి తప్పిపోయిన వైనం
అప్పటి నుంచి తమిళనాడులో గొర్రెల కాపరిగా వెట్టిచాకిరీ
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అన్వేషణ
పార్వతీపురం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): తమిళనాట తప్పిపోయిన అప్పారావు కుటుంబ ఆచూకీ లభ్యమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన కొండగొర్రె అప్పారావు 20 ఏళ్ల క్రితం తన స్వగ్రామం నుంచి కొంతమందితో కలిసి పనికోసం రైలులో పాండిచ్చేరికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో టీ తాగడానికి అప్పారావు రైలు దిగడంతో ఆ రైలు వెళ్లిపోయింది. డబ్బులు లేకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. ఇటీవల తమిళనాడులోని శివగంగ జిల్లా కదంబకళంలో తనిఖీల్లో అప్పారావు అడవిలో గొర్రెలు కాస్తూ లేబర్ అధికారుల కంటబడ్డాడు. విచారించగా, తమిళనాడులో ఓ వ్యక్తి 20 ఏళ్లుగా జీతం ఇవ్వకుండా గొర్రెల కాపరిగా పెట్టి పని చేయించుకున్నట్లు తేలింది. దీంతో ఇన్నాళ్లూ వెట్టిచాకిరిలో మగ్గిన అప్పారావుకు అధికారులు విముక్తి కలిగించారు. తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని చెప్పగా, అక్కడి అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు.
ఇక్కడి పోలీసులు అప్పారావు ఫొటోను చుట్టుపక్కల గ్రామాల్లో చూపించినా ఎవరూ గుర్తు పట్టలేదు. ఈ క్రమంలో.. ‘ఉపాధి కోసం వెళ్లి 20 ఏళ్లుగా వెట్టిచాకిరీ’ అన్న శీర్షికతో అప్పారావు ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 2న కథనం ప్రచురితమైంది. ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పార్వతీపురం మండలం ములక్కాయవలసలో నివాసం ఉంటున్న కూతురు సాయమ్మ, అల్లుడు దొంబుదొర చందుకు తెలుసుకున్నారు. వారు మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. అప్పారావును రప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధి ప్రయత్నాలు చేస్తున్నారు.