Share News

Minister Lokesh: అర్హులందరికీ తల్లికి వందనం 66,57,509 మంది విద్యార్థులకు లబ్ధి

ABN , Publish Date - Sep 24 , 2025 | 05:34 AM

అర్హులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్‌ మంగళవారం శాసనమండలిలో చెప్పారు.

Minister Lokesh: అర్హులందరికీ తల్లికి వందనం 66,57,509 మంది విద్యార్థులకు లబ్ధి

  • వాట్సాప్‌లో ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం: లోకేశ్‌

  • పారిశుధ్య కార్మికుల పిల్లలకు పథకం అందట్లేదు: చైర్మన్‌

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్‌ మంగళవారం శాసనమండలిలో చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. ‘66,57,509 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చాం. విద్యార్థుల నుంచి మినహాయించిన రూ.2వేలు పాఠశాల నిర్వహణ, మౌలిక వసతులకు వినియోగిస్తాం’ అని చెప్పారు. వైసీపీ సభ్యులు రమేశ్‌యాదవ్‌, ఇజ్రాయేల్‌ మాట్లాడుతూ ‘అధికారంలోకి రాగానే అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా అర్హులందరికీ ఇవ్వలేదు. ఆప్కోస్‌ సిబ్బందితోపాటు రేషన్‌కార్డు లేకపోయినా, 300 యూనిట్లు వాడినా పథకం వర్తింపజేయలేదు. కేవలం 57లక్షల మందికే ఇచ్చారు’ అని విమర్శించారు. దీనికి లోకేశ్‌ బదులిస్తూ.. ‘వైసీపీ హయాంలో రూ.13వేలే ఇచ్చి, చివరలో ఇంకో రూ.500 తగ్గించారు. గత ప్రభుత్వం పెట్టిన రూల్స్‌నే మేం ఫాలో అవుతున్నాం. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్‌ ఐడీ మంజూరయ్యాక, ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులకు తర్వాత నిధులు విడుదల చేస్తాం. తప్పులపై మనమిత్ర వాట్సా్‌పలో మెసేజ్‌ పెట్టినా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. పారిశుధ్య కార్మికుల పిల్లలకూ పథకం రావట్లేదని మండలి చైర్మన్‌ ప్రస్తావించగా, అర్బన్‌ ప్రాంతాల్లో నెలకు రూ.12వేలు ఆదాయం ఉంటే పథకాన్ని ఇవ్వట్లేదని లోకేశ్‌ చెప్పారు.


వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ వర్సిటీకి అనుమతులున్నాయా?: టీడీపీ

కడప జిల్లాలో వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ సైన్స్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీకి అనుమతులున్నాయా? అని టీడీపీ సభ్యులు రాంగోపాల్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, రవిచంద్ర ప్రశ్నించగా.. మంత్రి లోకేశ్‌ జవాబిస్తూ.. ‘2020-21లో అనుమతులు లేకుండా అడ్మిషన్లు ప్రారంభించారు. మొదటి రెండు బ్యాచ్‌ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆ విద్యార్థులు మాజీ సీఎంను కలిసినప్పుడు మాపై దాడి చేశారు. మేమేదో అన్యాయం చేశామని మాట్లాడారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు ఎలా ప్రారంభించారో అర్ధం కావట్లేదు. బాధిత విద్యార్థులు నన్ను కలిసి, బాధలు చెప్పుకొంటే కేంద్రంతో మాట్లాడి, సమస్యను పరిష్కరించాం. గత ఆగస్టు నాటికి అనుమతులు తీసుకున్నారు. రెండు బ్యాచ్‌లకు అనుమతి తెచ్చాం. ప్రొఫెసర్ల నియామకంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నోటిఫికేషన్‌ ఆలస్యమై, విషయం కోర్టు పరిధిలోకి వెళ్లింది. న్యాయ వివాదాలు పరిష్కరించి, 4,300 పోస్టులు భర్తీ చేయడానికి, వర్సిటీ భవనాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు.

Updated Date - Sep 24 , 2025 | 05:37 AM