Share News

Nara Lokesh: 24 గంటలు టైమిస్తున్నా

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:50 AM

తల్లికి వందనం నగదులో విద్యార్థికి రూ.2వేలు చొప్పున తాను తీసుకున్నట్లు 24 గంటల్లో నిరూపించాలని వైసీపీ నేతలకు మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు చూపించలేకపోతే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటానని హెచ్చరించారు.

Nara Lokesh: 24 గంటలు టైమిస్తున్నా

  • రూ.2 వేలు నా ఖాతాలో పడినట్లు నిరూపించాలి

  • లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక

అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘తల్లికి వందనం’ నగదులో విద్యార్థికి రూ.2వేలు చొప్పున తాను తీసుకున్నట్లు 24 గంటల్లో నిరూపించాలని వైసీపీ నేతలకు మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు చూపించలేకపోతే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటానని హెచ్చరించారు. తల్లికి వందనం పథకంపై శుక్రవారం మాట్లాడారు. నింద వేసి పారిపోతే ఊరుకోబోమని, నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొన్నారు. దానిపై చట్టప్రకారం ముందుకెళ్తానని లోకేశ్‌ తేల్చి చెప్పారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకంలో భాగంగా 67,27,164 మంది విద్యార్థులకు రూ.8,745 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. సోమవారం నాటికి అందరి ఖాతాల్లో నగదు జమవుతుందని స్పష్టంచేశారు. అప్పటికీ నగదు రానివారు జూన్‌ 26 వరకు మనమిత్ర వాట్సాప్‌ ద్వారా లేదా సచివాలయాల ద్వారా వినతులు సమర్పిస్తే పొరపాట్లు సరిదిద్దుతామని చెప్పారు. 2శాతం మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల నగదు జమ కాలేదని, అలాంటి వారికి ఖాతా యాక్టివేట్‌ చేయించుకోవాలని మె సేజ్‌లు పంపామని వివరించారు. ‘‘80శాతం మందికి విద్యార్థి మిత్ర కిట్లు అందజేశాం. మిగిలినవారికి ఈ నెల 20లోగా అందిస్తాం. మధ్యాహ్న భోజనం పథకాన్ని సన్నబియ్యంతో అమ లు చేస్తున్నాం. తరగతికి ఒక టీచర్‌ అనే విధానంతో 9,600 మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేశాం. మీ పిల్ల ల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్య త మా ప్రభుత్వానిది’ అని తల్లిదండ్రుల కు లోకేశ్‌ పిలుపునిచ్చారు.


అప్పట్లో లెక్కలన్నీ తప్పులే

వైసీపీ హయాంలో విద్యార్థుల లెక్కలు తప్పు లు తడకలుగా చూపించారని లోకేశ్‌ ఆరోపించారు. వాస్తవంగా ప్రభుత్వ బడుల్లో ఎంతమంది చదువుతున్నారో తెలుసుకోవడానికి మూడు నెల లు పట్టిందని తెలిపారు. వైసీపీ చెబుతున్నట్లుగా నిజంగా 87లక్షల మంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఆ ప్రభుత్వం ఎందుకు అమ్మఒడి ఇవ్వలేదని లోకేశ్‌ నిలదీశారు. తల్లికి వందనం కోసం గత ప్రభుత్వ నిబంధనలనే అమలు చేస్తున్నామని చెప్పారు. మినహాయించిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి ఖర్చుచేస్తామన్నారు. యూనివర్సిటీల వీసీలను 3 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పారు. కాగా, తల్లికి వందనం నగదు విడుదలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి మంత్రి లోకేశ్‌ సమీక్షించారు. ఇప్పటివరకూ ఎంతమందికి నగదు చేరిందని ఆరా తీశా రు. ఆర్బీఐ వద్ద నిధుల విడుదలలో ఏవైనా సమస్యలున్నాయా అని అడిగారు. అర్హులందరికీ నగదు అందేలా చూడాలని సూచించారు.

Updated Date - Jun 14 , 2025 | 03:51 AM