Share News

Guntur Court: తాడేపల్లి గ్యాంగ్‌ రేప్‌ కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:09 AM

తాడేపల్లి గ్యాంగ్‌ రేప్‌ కేసులో రెండో ముద్దాయి సీరు కృష్ణ కిశోర్‌కు 20ఏళ్ల జైలుశిక్ష, రూ.62వేల జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ శుక్రవారం తీర్పు చెప్పారు.

Guntur Court: తాడేపల్లి గ్యాంగ్‌ రేప్‌ కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు

  • ఇప్పటికీ పరారీలోనే మొదటి నిందితుడు!

గుంటూరు(లీగల్‌), జూలై 25(ఆంధ్రజ్యోతి): తాడేపల్లి గ్యాంగ్‌ రేప్‌ కేసులో రెండో ముద్దాయి సీరు కృష్ణ కిశోర్‌కు 20ఏళ్ల జైలుశిక్ష, రూ.62వేల జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ శుక్రవారం తీర్పు చెప్పారు. మాజీ సీఎం జగన్‌ ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన పెద్ద దుమారాన్ని రేపింది. ఈ కేసులో మొదటి ముద్దాయి ఇప్పటికీ పరారీలో ఉండడం గమనార్హం. వివరాలివీ.. విజయవాడ ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్స్‌ రాత్రి డ్యూటీ ముగించుకొని 2021 జూన్‌ 19న రాత్రి 9 గంటల ప్రాంతంలో తన మిత్రుడితో కలిసి బైక్‌పై తాడేపల్లి సీతానగరం ఘాట్‌కు వచ్చి ఇసుక తిన్నెలపై కాసేపు గడిపారు. అక్కడ వారిని ప్రకాశం జిల్లా చిన్నగంజాంకు చెందిన(తాడేపల్లిలో నివాసం) రామలింగం ప్రసన్నరెడ్డి, సీరు కృష్ణ కిశోర్‌ బెదిరించి.. ఆమె మిత్రుడి కాళ్లూ చేతులు కట్టేశారు. ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. 2021 ఆగస్టు 7న ఈ కేసులో రెండో నిందితుడైన కృష్ణ కిశోర్‌ను పోలీసులు అరెస్టు చేయగా విచారణలో ఈ నేరంతో పాటు.. తానూ, ప్రసన్నరెడ్డితో కలిసి ఎడ్లపల్లి ఆనందకుమార్‌ అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రసన్న రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు చూపగా కోర్టులో కృష్ణకిశోర్‌పైనే విచారణ సాగింది. కాగా, తుది తీర్పులో.. నిందితుడికి వేసిన జరిమానా రూ.62వేలు బాధితురాలికి చెల్లించాలని, దీనితో పాటు అదనంగా మరో రూ.లక్ష ప్రభుత్వం నుంచి ఆమెకు అందేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను కోర్టు ఆదేశించింది.

Updated Date - Jul 26 , 2025 | 05:11 AM