AP Government: పరిశ్రమలకు తీపి కబురు
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:07 AM
పావళి పండగ వేళ కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు తీపికబురు చెప్పింది. త్వరలో రూ.1,500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు తొలి విడతగా త్వరలో విడుదల
పారిశ్రామికవేత్తలకు అండ
పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ హర్షం
అమరావతి/విజయవాడ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండగ వేళ కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు తీపికబురు చెప్పింది. త్వరలో రూ.1,500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్’ వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘చీకటిని తరిమేస్తూ వెలుగులు నింపేది దీపావళి పండగ. అలాంటి పండగ వేళ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూతనివ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.1500 కోట్ల ప్రోత్సాహకాలను తొలి విడతగా త్వరలో విడుదల చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాల నగదు మొదటి విడతగా రూ.1,500 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు ప్రకటించడం పట్ల ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ ఫెడరేషన్ అధ్యక్షుడు పి.భాస్కరరావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి అతిపెద్ద ఉపశమనమని, ఉత్పత్తి కార్యకలాపాల పునరుద్ధరణకు, వృద్ధిని కొనసాగించడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుందన్నారు. నవంబరు 14న జరగనున్న గ్లోబల్ బిజినెస్ సదస్సుకు ముందే మరో విడత ప్రోత్సాహకాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.