SCOCH Award: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రకు స్కోచ్ అవార్డు
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:16 AM
దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో జరుగుతున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని...
విజయవాడ (భారతీనగర్), సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో జరుగుతున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, దానికి ప్రతిఫలంగా అత్యంత ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు లభించిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో జరగని విధంగా ఒక రోజంతా ముఖ్యమంత్రి ప్రజల్లో ఉండే కార్యక్రమం మన రాష్ట్రంలోనే జరిగిందని, అందుకే ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. అలాగే, దేశంలోనే మొదటిసారిగా ఫస్ట్ సర్క్యులర్ ఎకానమీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, ఫస్ట్ రీసైక్లింగ్ పార్కు కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో అక్టోబరు 2న 16 కేటగిరీల్లో రాష్ట్రస్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇస్తామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 6 వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు రాబోతున్నాయని, వాటిలో రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులోని 4 ప్రాజెక్టులకు వర్క్ ఆర్డర్లు జారీ చేశామని తెలిపారు. అక్టోబరు 2 నాటికి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని చెప్పారు.
స్వర్ణ నారావారిపల్లెకు అవార్డుపై సీఎం అభినందనలు
అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు తొలి సంవత్సరంలోనే స్కోచ్ గోల్డెన్ అవార్డుతో గుర్తింపు పొందడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయానికి కారణమైన బృందాన్ని, ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని అభినందిస్తున్నానని అన్నారు. కేవలం 45 రోజుల్లోనే 1600 ఇళ్లలో సౌర ఫలకలను ఉచితంగా ఏర్పాటు చేసి, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.