Share News

SVU Professor Case: కారులోనే శవమై..

ABN , Publish Date - Dec 27 , 2025 | 05:06 AM

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఎంబీఏ విభాగ ప్రొఫెసర్‌ సర్దార్‌ గుగ్లోత్‌ నాయక్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అలిపిరి సమీపంలో డోర్లు లాక్‌ చేసిన కారులో ఆయన చనిపోయి ఉన్నారు.

SVU Professor Case: కారులోనే శవమై..

  • 3-4 రోజులుగా దాని లోపలే కుళ్లుతూ..

  • ఎస్వీయూ ప్రొఫెసర్‌ గుగ్లోత్‌ నాయక్‌ అనుమానాస్పద మృతి

  • దుర్వాసన రావడంతో పోలీసులకు యాత్రికుల సమాచారం

  • భార్యతో మనస్పర్థలు.. ఇటీవల ఎక్కువైన మద్యంపానం

తిరుపతి విశ్వవిద్యాలయాలు/నేరవిభాగం/మరిపెడ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఎంబీఏ విభాగ ప్రొఫెసర్‌ సర్దార్‌ గుగ్లోత్‌ నాయక్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అలిపిరి సమీపంలో డోర్లు లాక్‌ చేసిన కారులో ఆయన చనిపోయి ఉన్నారు. కారు నుంచి దుర్వాసన వస్తుండటంతో యాత్రికుల సమాచారంతో పోలీసులు కారు తలుపులు తీయగా.. ఆయన మృతి వెలుగు చూసింది. వర్సిటీ వర్గాలు, వెస్ట్‌ సీఐ మురళీమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుగ్లోత్‌ నాయక్‌ది మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తాండా ధర్మారం. 2007లో ఎస్వీయూ ఎంబీఏ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆయన భార్య మీనాభాయ్‌ చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో టీచరుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలున్నాయి. ఇద్దరూ విడిగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా గుగ్లోత్‌ నాయక్‌ బాగా మద్యానికి బానిసయ్యారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మూడు నెలల కిందట ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. ఇటీవల మద్యం తాగుడు ఎక్కువైనట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అలిపిరి సమీపంలోని ఎస్వీ జూపార్కు రోడ్డులో కారు నుంచి దుర్వాసన వస్తున్నట్లు కొందరు యాత్రికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి కారు డోర్లు తీయగా.. అందులో గుగ్లోత్‌ నాయక్‌ మృతదేహం కనిపించింది. కారు డోర్లన్నీ లాక్‌ చేసి ఉన్నాయి.


గుగ్లోత్‌ నాయక్‌ కారు వెనక సీట్లో పడుకుని ఉన్నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రుయాకు తరలించారు. నివేదిక వస్తే.. మృతికి గల కారణం తెలిసే అవకాశం ఉంది. కారులో ఉన్న 10 జతల దుస్తులు, తినే ప్లేట్‌, మాత్రలు, సిరప్‌, రెండు మద్యం సీసాలను పోలీసులు సీజ్‌ చేశారు. చొక్కా మాత్రమే వేసుకొని ఉన్న ఆయన.. బెడ్‌ షీట్‌ కప్పుకొని ఉన్నారు. చనిపోయి మూడు నాలుగు రోజులై ఉంటుందని పోలీసులు చెప్పారు. మృతుడి భార్య మీనాభాయ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గుగ్లోత్‌ నాయక్‌ ఎలా చనిపోయారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీ మోహన్‌ తెలిపారు. ప్రొఫెసర్‌ మృతి పట్ల ఎస్వీయూ వీసీ నరసింగరావు, రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో శుక్రవారం తరగతులు రద్దు చేశారు. నాయక్‌ తల్లి చనిపోగా తండ్రి ఉన్నారు. కొడుకు మృతితో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

Updated Date - Dec 27 , 2025 | 05:07 AM