Suspicious Incident: విచారణకు బయల్దేరి..పట్టాల పక్కన విగతజీవిగా..
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:47 AM
తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారు, అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ జీఆర్పీ సీఐ వై.సతీశ్‌కుమార్(45) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
‘పరకామణి’ ఫిర్యాదుదారు సతీశ్‌కుమార్ అనుమానాస్పద మృతి
‘రాజీ’ కేసులో విచారణ కోసం తిరుపతికి రైల్లో వెళ్తుండగా ఘటన
తాడిపత్రి సమీపంలో జీఆర్పీ సీఐ సతీశ్ మృతదేహం లభ్యం
శరీరంపై తీవ్ర గాయాల్లేవు.. కానీ, ముక్కలు ముక్కలైన తల భాగం.. హత్యేనని అనుమానం!
రైల్లోంచి పడితే శరీరమంతా దెబ్బలుండాలి
గట్టిగా తలపై బాదినట్టు ఉంది
సీటీ స్కానింగ్ తర్వాత వైద్యుల అభిప్రాయం
తాడిపత్రి, గుంతకల్లు, అనంతపురం క్రైమ్/పత్తికొండ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారు, అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ జీఆర్పీ సీఐ వై.సతీశ్‌కుమార్(45) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వేట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం ఆయన మృతదేహం కనిపించింది. పరకామణి కేసులో విచారణకు తిరుపతికి బయలుదేరి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సలో గుంతకల్లు నుంచి గురువారం రాత్రి ఆయన బయలుదేరారు. ఏ1 బోగీలో 29వ బెర్తును రిజర్వు చేసుకున్నారు. తాడిపత్రి సమీపంలోని జుటూరు-కోమలి స్టేషన్ల మఽధ్య అర్ధరాత్రి దాటిన తరువాత (శుక్రవారం తెల్లవారుజాము 1.45 గంటల సమయంలో) రైలు నుంచి కింద పడిపోయినట్లు భావిస్తున్నారు. ఇది ప్రమాదమా... హత్యనా... ఆత్మహత్యనా.. అన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం ఉదయం 9.30 ప్రాంతంలో ఓ రైల్వే పాయింట్స్‌మన్ పట్టాల పక్కన సతీశ్‌కుమార్ మృతదేహాన్ని చూసి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జేబులో ఐడెంటిటీ కార్డు ఆధారంగా మృతి చెందింది జీఆర్పీ సీఐ సతీశ్‌కుమార్‌గా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీశ్ ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి ఆధారాలను సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ముక్కలుచెక్కలుగా పుర్రె..!
సతీశ్‌కుమార్ మృతదేహంపై తీవ్ర గాయాలు లేవు. తల అంతర్భాగం (పుర్రె) మాత్రం పీసులు పీసులయింది. కదిలే రైలు నుంచి కిందపడితే శరీరంలోని ఇతర భాగాలకూ గాయాలు కావాలి. కానీ శరీరంపై గాయాలు లేకపోగా.. తల మాత్రం ముక్కలైంది. దీంతో ఇది హత్యే అయి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి సీటీ స్కాన్ అనంతరం వైద్యులు ఈ అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రూ.వందల కోట్ల పరకామణి స్కామ్‌లో కీలక ఆధారంగా ఉన్న ఆయన అనూహ్యంగా మృతి చెందడంతో లోతైన దర్యాప్తునకు పోలీస్‌శాఖ సిద్ధమైంది. పంచనామా తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మృతదేహానికి ఇతర పరీక్షలు, పోస్టుమార్టం కోసం అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాయంత్రం తర్వాత సీటీ స్కాన్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు, తల భాగం ఛిద్రమైనట్టు వైద్యులు గుర్తించారు. హత్య చేసేందుకు తలపై గట్టిగా బాదినందుకే పుర్రె ముక్కలై ఉంటుందని అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేశారు. సతీశ్‌ది హత్య అంటూ ఆయన బంధువులు, కుమ్మర శాలివాహన సంఘం నాయకులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
పేదరికం నుంచి పోలీసుగా ఎదిగి..
కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన బ్రహ్మయ్య, చిదంబరమ్మల పెద్దకుమారుడు సతీశ్ కుమార్. చిన్నప్పటినుంచీ పేదరికాన్ని చూస్తూ పెరిగిన సతీశ్.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పీజీ చేశారు. 2008లో కానిస్టేబుల్‌గా ఎంపికై ఆదోనిలో పోస్టింగు పొందారు. 2012లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. 2013లో చిత్తూరు జిల్లాలో ఎస్‌ఐగా చేరారు. మూడేళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో చేసిన తరువాత, టీటీడీ ఏవీఎ్‌సవోగా తొమ్మిదేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే పరకామణి చోరీ ఘటనలో ఫిర్యాదు చేశారు. ఏవీఎ్‌సవో హోదాలోనే 2023 జూన్‌లో తిరుచానూరుకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది మే నెలాఖరున చిత్తూరు ఏఆర్‌కు వచ్చారు. మూడు నెలల కిందట డిప్యుటేషన్‌పై గుంతకల్లు రైల్వే సీఐగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం గుంతకల్లులోనే నివాసం ఉంటున్నారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుల్ కుమార్తె మమతతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె లోహితాక్ష(6), కుమారుడు తారా సతీశ్(3) ఉన్నారు.
కఠినంగా శిక్షంచాలి: చిదంబరమ్మ, తల్లి
‘‘ఎవరి మనసునూ నొప్పించని మనస్తత్వం నా కుమారుడిది. పోలీసయ్యాక కూడా అలాగే ఉన్నాడు. ఉద్యోగం, కుటుంబం, మిత్రులు తప్ప వేరే లోకం తెలియదు. అలాంటివాడిని అన్యాయంగా చంపేశారు. నాకు కడుపు కోత మిగిల్చిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి’’
అనుమానాలెన్నో..
ఒత్తిడిలో ఉన్నారంటున్న సన్నిహితులు
పరకామణి చోరీ కేసులో ఫిర్యాదీ సతీశ్
లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నదీ ఆయనే
ఉన్నతస్థాయి ఒత్తిళ్లతోనే ఆ నిర్ణయం
సతీశ్ కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరకామణి కేసులో నిందితుడు రవికుమార్‌పై ఫిర్యాదు చేసిందీ, లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకున్నది సతీశే. రూ.వంద కోట్ల పరకామణి స్కామ్ కేసులో ఆయనే కీలక వ్యక్తి. సీఐడీ విచారణ కొలిక్కి రావాలంటే సతీశ్ వెల్లడించే వివరాలే కీలకం. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరిగే సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరి మార్గమధ్యంలో మరణించడం అనుమానాలకు దారితీస్తోంది. పరకామణి కేసుకు సంబంధించి రెండు సందర్భాల్లో సతీశ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. రవికుమార్‌ను కాపాడేందుకు కేసును రాజీ చేసుకోవాలంటూ సతీశ్‌పై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్టు సమాచారం. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఏవీఎస్‌వో అంటే సీఐ స్థాయి అధికారి. పరకామణి చోరీ వంటి ఘటనలో కోర్టులో రాజీ చేసుకునే సాహసం ఆ స్థాయి అధికారి చేసే అవకాశమే లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా చేయలేరు. కీలక వ్యక్తుల ఒత్తిళ్లతోనే సతీశ్ కోర్టులో కేసును రాజీ చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ప్రమాదవశాత్తూ రైల్లో నుంచి సతీశ్ జారిపడి చనిపోయే అవకాశాలు తక్కువనే భావిస్తున్నారు. ఈనెల 10న సతీశ్‌ను సిట్ విచారించింది. మరోసారి సీఐడీ విచారణకు బయల్దేరిన సతీశ్.. దానికి మానసికంగా సిద్ధపడే ఉంటారన్న వాదన వినిపిస్తోంది. అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. పరకామణి కేసుతో ముడిపడిన వ్యక్తులంతా రాజకీయంగా, ఆర్థికంగా బలమైన వారు. సతీశ్ నోరు తెరిచి కేసు రాజీకి ఒత్తిడి చేసింది ఫలానా వారని చెబితే ఆ వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా మారే అవకాశముంది. అలాంటి వ్యక్తుల ఒత్తిడిని తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పరకామణి కేసుతో ముడిపడిన బలమైన వ్యక్తులు తాము తప్పించుకునేందుకు హత్య చేయించి ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాగా, సతీశ్ భార్య మమత, తన బంధువులు జీఆర్పీ పోలీసులను కలిసి సతీశ్‌కుమార్ మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.