Share News

Suspicious Demise of CI Satish Kumar: ఆ గంటలో ఏం జరిగింది?

ABN , Publish Date - Nov 17 , 2025 | 03:46 AM

టీటీడీ మాజీ ఏవీఎస్‌వో, జీఆర్పీ సీఐ సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

Suspicious Demise of CI Satish Kumar: ఆ గంటలో ఏం జరిగింది?

  • గుంతకల్లు నుంచి కోమలి వరకు

  • సీఐ సతీశ్‌ ప్రయాణించిన సమయమే కీలకం

  • ఆ దిశగానే కేసు దర్యాప్తు.. రెండో రోజూ కోమలిలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

  • కదులుతున్న రైలు నుంచి బొమ్మను తోసేసి పరిశీలించిన పోలీసులు

  • ఏ-1 పక్క బోగీల్లో పాత నేరస్థులు.. వివిధ బోగీల్లో ప్రయాణించిన 13 మంది

  • ఆ కోణంలోనూ విచారణ చేస్తున్న పోలీసులు

అనంతపురం క్రైం/పత్తికొండ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): టీటీడీ మాజీ ఏవీఎస్‌వో, జీఆర్పీ సీఐ సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆయనది హత్యా?, ట్రైన్‌లోనే చంపేసి తోసేశారా? లేక రైలు నుంచి కింద పడ్డారా?... అసలు ఏం జరిగిందన్న కోణాల్లో దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అనంతపురం జిల్లా పోలీసులు ఈ కేసుపైనే కసరత్తు చేస్తున్నారు. ఆదివారం తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్‌పై సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి ఆధ్వర్యంలో చెన్నై-ఎగ్మోర్‌ ట్రైన్‌ నుంచి సతీశ్‌ కుమార్‌ బరువుతో ఉన్న మూడు బొమ్మలను కిందకు తోసేశారు. ఆ బొమ్మలు రైల్వే ట్రాక్‌ నుంచి ఎంతదూరంలో పడ్డాయి...? ఏవిధంగా పడ్డాయి..? తదితర వివరాలను నమోదు చేసుకున్నారు. ఆ సీన్‌ మొత్తాన్ని డ్రోన్‌ కెమెరాలతో రికార్డు చేశారు. సీఐ సతీశ్‌ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సలోని పలు బోగీల్లో పాత నేరస్తులు, పలు కేసుల్లో సాక్షులుగా ఉన్నవారు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. పలు కేసులున్న నేరస్తులు ఏ-1 బోగీలో ముగ్గురు, ఎస్‌-4లో ఒకరు, ఎస్‌-5లో ఇద్దరు, ఎస్‌-6లో ఇద్దరు, ఎస్‌-7లో ఇద్దరు, బీ-1లో ఒకరు, బీ-5లో ఒకరు, బీ-6లో ఒకరు ఉన్నట్లు గుర్తించారు. వారు ఎక్కడ ట్రైన్‌ ఎక్కారు? ఎక్కడ దిగారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, ఈ కేసు చిక్కుముడి వీడాలంటే.. సతీశ్‌ కుమార్‌ గుంతకల్లు నుంచి కోమలి వరకు ప్రయాణించిన ‘గంటే’ కీలకమని పోలీసులు భావిస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో తేల్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సతీశ్‌ 13న రాత్రి గుంతకల్లులో రైలు ఎక్కారు. రాత్రి 1:03 గంటలకు రైలు కదిలింది. గుంతకల్లు నుంచి కోమలి వరకు చేరుకునేందుకు గంట సమయం పట్టింది. జూటూరు, కోమలి మధ్యనే ఆయన విగతజీవిగా మారారు. గంట సమయంలో ట్రైన్‌లో ఏం జరిగిందన్న దానిపై దృష్టి సారిస్తే సతీశ్‌ మరణానికి సంబంధించి ‘కీలక’ సమాచారం లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు.


సతీశ్‌ది ముమ్మాటికీ హత్యే: సోదరులు

సీఐ సతీశ్‌ కుమార్‌ది హత్యేనని ఆయన సోదరులు ఆరోపించారు. సతీశ్‌కుమార్‌కు నివాళులు అర్పిస్తూ ఆదివారం కర్నూలు జిల్లా పత్తికొండలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలి వద్ద భైఠాయించి ధర్నాకు దిగారు. గత ప్రభుత్వంలో పెద్దలే సతీశ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చి పరకామణి కేసుపై లోక్‌అదాలత్‌లో రాజీపడేలా చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహరం హైకోర్టు పరిధిలోకి వెళ్లడం, సీఐడీ దర్యాప్తు జరగడంతో తమపేర్లు ఎక్కడికి బయటకు వస్తాయోనని అప్పటి ప్రభుత్వ పెద్దలలో భయం నెలకొందని, ఈ నేపథ్యంలోనే సతీశ్‌కుమార్‌ హత్య జరిగిందన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనన్నారు. కానీ, కొందరు కావాలనే ఆత్మహత్య అని ప్రచారం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణచేసి నిందితులను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. సతీశ్‌కుమార్‌ను హత్యచేసిన వారిని గుర్తించి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోదరుడు శ్రీహరి డిమాండ్‌ చేశారు. సతీశ్‌ కుమార్‌ది కచ్చితంగా హత్యేనని ఆయన బంధువు పెద్దయ్య ఆరోపించారు.

Updated Date - Nov 17 , 2025 | 03:48 AM