Share News

Political Involvement: సీఐ సతీశ్‌ది హత్యే

ABN , Publish Date - Nov 15 , 2025 | 05:12 AM

జీఆర్పీఎఫ్‌ రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ (సీఐ) సతీశ్‌ కుమార్‌ది ఆత్మహత్య కాదు. కుట్రపూరితంగా హత్య చేశారు అని అనంతపురం కుమ్మర శాలివాహన సంఘం నాయకులు, బాధితుడి బంధువులు ఆరోపించారు.

Political Involvement: సీఐ సతీశ్‌ది హత్యే

భూమన, వైవీ ముఠాల పని ఇది: పట్టాభి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘జీఆర్పీఎఫ్‌ రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ (సీఐ) సతీశ్‌ కుమార్‌ది ఆత్మహత్య కాదు. కుట్రపూరితంగా హత్య చేశారు’ అని అనంతపురం కుమ్మర శాలివాహన సంఘం నాయకులు, బాధితుడి బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద రాత్రి 7 గంటల సమయంలో వారు ఆందోళన చేశారు. తమకు న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వారించినా, నిరసన కొనసాగించారు. ఆఖరికి పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. మరోవైపు మృతుని భార్య మమత, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కనిపించారు. ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.పట్టాభిరామ్‌ విజయవాడలో ఇదే విషయంపై మీడియాతో మాట్లాడారు. ‘సతీశ్‌ కుమార్‌ది ముమ్మాటికీ హత్యే. కీలకమైన కేసుల్లో సాక్షులను చంపిన చరిత్ర వైసీపీ దొంగల ముఠాది. కరుణాకర్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వెనుక ఉన్న దొంగల ముఠా ఈ హత్యకు పాల్పడింది’ అని పట్టాభి అన్నారు. కాగా ఇదే అంశంపై బోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి ఓ ప్రకటన చేశారు. సతీశ్‌కుమార్‌ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. సతీశ్‌కుమార్‌ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీటీడీ బోర్డుకు చెందిన మరో సభ్యుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ప్రభుత్వాన్ని కోరారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ, సతీశ్‌ మరణంపై ఎస్పీ దర్యాప్తు చేపట్టి నిజాలను నిగ్గు తేల్చాలన్నారు.


  • రవికుమార్‌కు రక్షణ ఇవ్వండి

  • టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి

టీటీడీ పరకామణి కేసులో నిందితుడిగా వున్న రవికుమార్‌కు పోలీసు భద్రత కల్పించాలని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ను కలిశారు. పరకామణి కేసులో ఫిర్యాదిదారుడు సతీశ్‌కుమార్‌ మృతిపై చాలా అనుమానాలున్నాయని చెప్పారు. అనంతరం భానుప్రకాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘కేసు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు కీలక వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారు. సతీశ్‌ అప్రూవర్‌గా మారతాడనే అనుమానంతోనే ఈ ఘోరానికి పాల్పడే అవకాశం ఉంది. బాబాయ్‌ గొడ్డలి పెట్టును గుండె పోటుగా చిత్రీకరించిన ఘనులు ఈ కేసును ఎన్నో మలుపులు తిప్పే అవకాశాలు ఉన్నాయన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 05:14 AM