Transport Disruption: నిలిచిన ప్రజా రవాణా
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:58 AM
మొంథా తుఫాను ప్రభావిత తీర ప్రాంత జిల్లాల కు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఎక్కువ శాతం రద్దయ్యాయి. మంగళవారం అరకొరగా నడిచినా అవీ ఖాళీగా కనిపించాయి.
ఆగిన ఆర్టీసీ, రైళ్ల సర్వీసులు
ప్రయాణాలు ఆపుకొన్న ప్రజలు
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావిత తీర ప్రాంత జిల్లాల కు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఎక్కువ శాతం రద్దయ్యాయి. మంగళవారం అరకొరగా నడిచినా అవీ ఖాళీగా కనిపించాయి. నిత్యం కిటకిటలాడే విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ జనం లేక బోసిపోయింది. రిజర్వేషన్ చేసుకున్న వారు సైతం ప్రయాణాలను రద్దు చేసుకొన్నారు. హైదరాబాద్, కర్నూలు, తిరుపతి వైపు వెళ్లే బస్సుల్లో తక్కువగానే ప్రయాణికులు కనిపించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో మాత్రం వాతావరణం అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు బస్సులు నడిపారు. ప్రతి రోజూ 400కుపైగా బస్సులు తిరిగే విజయవాడ బస్టాండ్ నుంచి మంగళవారం 230 బస్సులు మాత్రమే తిరిగాయి. తుఫాను తీవ్రత నేపథ్యంలో ప్రయాణికుల భద్రతతో పాటు సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్టీసీ మొంథా ప్రభావిత ప్రాంతాల బస్సులు రద్దు చేసి ప్రయాణీకులకు ముందస్తు సందేశాలు పంపించింది.
నేటి పలు రైలు సర్వీసులు రద్దు
తుఫాన్ నేపథ్యంలో బుధవారం నడిచే 37 సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. కాకినాడ, తెనాలి, రేపల్లె, మచిలీపట్నం, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, భీమవరం, మాచెర్ల తదితర ప్రాంతాల నుంచి నడిచే ప్యాసింజర్ రైళ్లు ఆపేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు. గుంటూరు, విశాఖపట్నం మధ్యలో నడిచే రైళ్లు ఎక్కువగా రద్యయ్యాయని, దూర ప్రాంతాలకు వెళ్లే ఆరు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. మరో పద్దెనిమిది రైళ్ల సమయ వేళల్ని మార్పు చేశామని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మరో 24 రైళ్లను రద్దు చేశారు. వాల్తేరు డివిజన్ అధికారులు మంగళవారం 23 రైళ్లను రద్దు చేశారు. మరో 15 రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. ఎన్‌టీఈఎస్ యాప్ ద్వారా రైళ్ల రాకపోకల వివరాలు తెలియజేస్తోన్న రైల్వే శాఖ.. విజయవాడ కంట్రోల్ రూమ్‌లో హెల్ప్‌డె్‌స్కలను ఏర్పాటు చేసింది. విజయవాడ-0866 2575167, గూడూరు- 08624-250795, గుడివాడ-78159 09462, నెల్లూరు-90633 47961, ఒంగోలు- 78159 09489, బాపట్ల-78159 09329, తెనాలి-78159 09463, ఏలూరు-75693 05268, రాజమండ్రి-83319 87657, సామర్లకోట- 7382383188, తుని-78159 09479, అనకాపల్లి-75693 05669, భీమవరం-78159 09402 నంబర్లకు ఆయా ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే సంప్రదించవచ్చు.