IPS Officer PV Sunil Kumar: రఘురామను తొలగించాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:47 AM
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అయింది.
అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలి
ఐపీఎస్ సునీల్‌కుమార్ పోస్టు
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అయింది. ‘దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే.. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణరాజును కూడా అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలి కదా.. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయన్ను అన్ని పదవుల నుంచి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే సందేశం వెళ్లాలి’ అంటూ ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా పీవీ సునీల్ ఉన్నప్పుడు అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని గుంటూరు సీఐడీ కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రఘురామ ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి పీవీ సునీల్‌ను ఇటీవలే ప్రశ్నించారు. రఘురామపై ఉన్న సీబీఐ కేసుల విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పీవీ సునీల్ పోస్టు చేశారు.