Survey of India: భూముల సర్వేకు ఎస్‌వోఐ సాయం
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:50 AM
రాష్ట్రంలో భూముల సర్వేకోసం సర్వే ఆఫ్ ఇండియా(ఎస్‌వోఐ) సాయం అందించనుంది. ఈ క్రమంలో కార్స్ నెట్‌వర్క్‌తో ఎస్‌వోఐ అనుసంధానం అయింది.
ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల సర్వేకోసం సర్వే ఆఫ్ ఇండియా(ఎస్‌వోఐ) సాయం అందించనుంది. ఈ క్రమంలో కార్స్ నెట్‌వర్క్‌తో ఎస్‌వోఐ అనుసంధానం అయింది. ఏపీ కార్స్ నెట్‌వర్క్ స్టేషన్‌లు జాతీయ స్థాయిలో ఎస్‌వోఐ డేటాతో అనుసంధానం కానున్నాయి. ఐదేళ్లపాటు కార్స్ నెట్‌వర్క్ స్టేషన్‌లను ఎస్‌వోఐ నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం అమరావతిలోని సర్వే డైరెక్టరేట్‌లో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మి సమక్షంలో ఎస్‌వోఐ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా హితేశ్ కుమార్, ఏపీ సర్వేశాఖ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఏపీ కార్స్ నెట్‌వర్క్ బేస్ స్టేషన్ల నిర్వహణ, పర్యవేక్షణ వంటివి ఎస్‌వోఐ చూస్తుంది. ఏపీడేటా జాతీయ స్థాయి జియోడేటిక్ రిఫరెన్స్ ఫ్రేమ్‌తో అనుసంధానమవుతుంది. నిర్వహణ ఖర్చును సర్వే ఆఫ్ ఇండియానే భరించనుంది. ఈప్రాజెక్టులో డేటా విడుదల, షేరింగ్ వల్ల వచ్చే ఆదాయంపై పూర్తిహక్కులు ఏపీకే ఉండనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. భూముల సర్వేలో సెంటీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో డేటాను అందించగలసామర్థ్యం కార్స్ నెట్‌వర్క్‌కు ఉంది. ఇది కేవలం సాంకేతిక ఒప్పందం కాదని, పారదర్శకత, ఇన్నోవేషన్‌కు పు నాది అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి అన్నారు.