Supreme Court: తిరుమల లడ్డూ వ్యవహారం.. సీబీఐ పిటిషన్‌పై 26న సుప్రీం విచారణ
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:05 AM
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు అధికారి వెంకట్రావుపై హైకోర్టు ఉత్తర్వులను సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు అధికారి వెంకట్రావుపై హైకోర్టు ఉత్తర్వులను సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కల్తీ నెయ్యి ఆరోపణలపై అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ను నియమించింది. సిట్ విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలని వెంకట్రావు.. చిన్నప్పన్న అనే వ్యక్తికి నోటీసులిచ్చారు. ఆ నోటీసు లను చిన్నప్పన్న హైకోర్టులో సవాల్ చేశారు. వెంకట్రావు నియామకం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదని.. ఆయన దర్యాప్తు నిర్వహించరాదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ సోమవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. విచారణను వాయిదా వేయాలని.. ఈ నెల 26న తమ వాదనలు వినాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు. దీంతో 26నే లిస్ట్ చేయాలని జస్టిస్ గవాయ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.