Share News

Illegal Sand Mining: సుప్రీం ముందుకు నేడు ఇసుక కేసు

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:26 AM

జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. సోమవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

Illegal Sand Mining: సుప్రీం ముందుకు నేడు ఇసుక కేసు

  • జగన్‌ జమానాలో 3.91 లక్షల టన్నుల ఇసుక అక్రమ తవ్వకం

  • అఫిడవిట్‌ దాఖలు చేసిన సర్కారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. సోమవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. జగన్‌ ప్రభుత్వ జమానాలో 2021-2024 వరకు 2,743 హెక్టార్ల పరిధిలో 3.91 లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వితీశార ని అందులో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 1.22 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి తవ్వకాలు చేసిన కంపెనీలకు 1,467 కోట్ల మేర డిమాండ్‌ నోటీసులు జారీ చేసినట్లుగా వివరించింది. బుధవారం జరిగే విచారణలో ప్రభుత్వ అఫిడవిట్‌ కీలకం కానుంది. అయితే, ఇంకా లెక్కతేలాల్సిన అక్రమ ఇసుక సొమ్ము చాలానే ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం కేవలం 1.22 కోట్ల టన్నులకు 1,467 కోట్ల మేర ఇసుక దోపిడి జరిగింది. ఇంకా 2.69 కోట్ల టన్నుల ఇసుక దోపిడికి లెక్కతేల్చాల్సి ఉంది. ఈ మొత్తం విలువ కనీసం 4వేల కోట్లపైనే ఉండొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే, ఏపీ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ అధ్యయనం ప్రకారం కేవలం ఒక మీటర్‌ లోతు మేర తవ్వకాలు జరిగితేనే 3.91 కోట్ల టన్నుల అక్రమంగా తవ్వితీసినట్లుగా గుర్తించారు. అయితే, గూగుల్‌ ఎర్త్‌ప్రో మ్యాప్స్‌, ఆనాడు తీసిన ఫొటోల ఆధారంగా కనీసం 5-6 మీటర్ల లోతున తవ్వకాలు జరిగాయని ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న నాగేంద్రకుమార్‌ చెబుతున్నారు. కేవలం ఒక మీటర్‌ లోతు తవ్వకాలను ప్రామాణికంగా తీసుకుంటేనే 3.91 కోట్ల అక్రమ తవ్వకాలు బయటపడ్డాయని, కానీ ఆనాడు గూగుల్‌ఎర్త్‌ ఫొటోలను, ఇతర సాక్ష్యాధారాలను పరిశీలిస్తే ప్రభుత్వం చెబుతున్నదానికంటే ఐదారు రెట్ల అక్రమ తవ్వకాలు జరిగాయని పిటిషనర్‌ సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కనీసం 6,500 హెక్టార్ల పరిధిలో అక్రమ తవ్వకాలు జరిగాయని కోర్టు దృష్టికి ఇంతకుముందే తీసుకెళ్లారు.

Updated Date - Sep 03 , 2025 | 05:27 AM