Share News

Supreme Court: సవేంద్రరెడ్డి కేసులో సీబీఐ దర్యాప్తుపై సుప్రీం స్టే

ABN , Publish Date - Oct 08 , 2025 | 03:36 AM

వైసీపీ వలంటీర్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్‌ మీడియా కార్యకర్త సవేంద్రరెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై...

Supreme Court: సవేంద్రరెడ్డి కేసులో సీబీఐ దర్యాప్తుపై సుప్రీం స్టే

  • ఎస్‌ఎల్‌పీ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి

  • గత నెల 22న గంజాయితో అరెస్టయిన వైసీపీ నేత సవేంద్రరెడ్డి

  • అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో భార్య పిటిషన్‌

  • సీబీఐకి అప్పగిస్తూ 26న హైకోర్టు తీర్పు.. ఇప్పుడు సుప్రీం స్టే

న్యూఢిల్లీ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ వలంటీర్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్‌ మీడియా కార్యకర్త సవేంద్రరెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసేందుకు రాష్ట్రప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. గత నెల 22న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు చినకొండ్రుపాడులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న బత్తుల దీవెన బాబును విచారించగా.. తాను కుంచాల సౌందరరెడ్డి అలియాస్‌ సవేంద్రరెడ్డి నుంచి గంజాయి కొన్నట్లు అంగీకరించాడు. అదేరోజు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వాహనం నుంచి దాదాపు కిలోన్నర గంజాయి పట్టుబడింది. ఈ క్రమంలోనే తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ సవేంద్రరెడ్డి భార్య కె.లక్ష్మీప్రసన్న మర్నాడు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన భర్త ఒక రాజకీయ పార్టీ సానుభూతిపరుడని, ఆయనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు. సవేంద్రరెడ్డిని విడుదల చేయాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ధర్మాసనం గత నెల 26న తీర్పు ఇచ్చింది. దీనిపై ఈ నెల 5న ప్రత్తిపాడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (క్రిమినల్‌) దాఖలు చేశారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ పరిధి కేవలం నిర్బంధం చట్టబద్ధమా కాదా అనేది చూడడానికే పరిమితమని, అలా కాకుండా.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం, పోలీసు దర్యాప్తును నిలిపివేయడం వంటి ఆదేశాలివ్వడాన్ని ఆయన తన పిటిషన్‌లో సవాల్‌ చేశారు.


ఈ వ్యాజ్యం మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సవేంద్రరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడనే కారణంతోనే తమ క్లయింటును పోలీసులు అరెస్టు చేశారని, ఉద్దేశపూర్వకంగానే గంజాయి కేసు పెట్టారని తెలిపారు. దీనిపై విచారణ జరపాలని హైకోర్టు సీబీఐని ఆదేశించిందన్నారు. దర్యాప్తు అధికారి వ్యక్తిగత హోదాలో పిటిషన్‌ దాఖలు చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. సవేంద్రరెడ్డిని గంజాయి కేసులో అరెస్టు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు నిబంధనలన్నీ పాటించే కేసు నమోదు చేశారన్నారు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదని.. ఉద్దేశపూర్వకంగానే గంజాయి కేసును రాజకీయాలతో ముడిపెడుతున్నారని తెలిపారు. ఈ కేసులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి రాష్ట్రప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, జిల్లా ఎస్పీ, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, పోలీసు ఇన్‌స్పెక్టర్‌, పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ డైరెక్టర్‌, రిలయన్స్‌ జియో, సీబీఐ, కుంచాల లక్ష్మీప్రసన్న సహా మొత్తం 11 మందికి నోటీసులు జారీ చేసింది. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. తదుపరి విచారణను నవంబరు 17వ తేదీకి వాయిదా వేసింది.


హైకోర్టు ఆదేశాలపై రీకాల్‌ పిటిషన్‌ ఉపసంహరణ

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ వలంటీర్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచాల సవేంద్రరెడ్డి అరెస్టు, ఆయనపై గంజాయి కేసు నమోదుపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వేసిన అనుబంధ (రీకాల్‌) పిటిషన్‌ను తాడేపల్లి పోలీసులు ఉపసంహరించుకున్నారు. మంగళవారం విచారణ ప్రారంభమైన వెంటనే పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) టి.విష్ణుతేజ స్పందిస్తూ.. అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని.. ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించేందుకు అనుమతించాలని కోరారు. అందుకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం అంగీకరించింది. పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Oct 08 , 2025 | 03:39 AM