Supreme Court: లడ్డూ సిట్‌కు పచ్చజెండా
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:26 AM
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) యథావిధిగా దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిపై సిట్ యథావిధిగా దర్యాప్తు చేయవచ్చు
నిర్దిష్ట అధికారిని దర్యాప్తు బృందం నియమించుకుంటే తప్పేంటి?
మొత్తం పర్యవేక్షణ సీబీఐ డైరెక్టర్‌దే కదా!.. చీఫ్ జస్టిస్ గవాయ్ అసహనం
వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నకు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు
విచారణ నవంబరు 14కు వాయిదా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) యథావిధిగా దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ సిట్‌లో తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) జె.వెంకట్రావును దర్యాప్తు అధికారిగా నియమించడాన్ని సమర్థించింది. ఆయన విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. సిట్ ఒక నిర్దిష్ట అధికారిని నియమించుకోవాలనుకుంటే.. అందులో తప్పేముందని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘దర్యాప్తు మొత్తం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు.. విచారణ బాధ్యతలను సిట్ మరో అధికారికి అప్పగించడంలో ఎటువంటి తప్పూ లేదు. సిట్ దర్యాప్తు పర్యవేక్షణను వదిలేయలేదు కదా! అది కేవలం తమ నియంత్రణలో పనిచేసే ఒక దర్యాప్తు అధికారిని మాత్రమే నియమించుకుంది’ అని స్పష్టంచేశారు. జగన్ ప్రభుత్వ సమయంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందనే ఆరోపణలపై అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. దీనిపై విచారణకు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని (సిట్) సర్వోన్నత న్యాయస్థానం నియమించడం.. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇద్దరు, భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) నుంచి సీనియర్ అధికారితో సిట్ ఏర్పాటు చేయడం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా సిట్ పలువురిని విచారించింది. కొన్ని డెయిరీల ఉన్నతాధికారులను అరెస్టుచేసింది. ఈ క్రమంలోనే.. విచారణకు రావాలని దర్యాప్తు అధికారి వెంకట్రావు.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కదురు చిన్నప్పన్నకు నోటీసులు ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు మార్గనిర్దేశం ప్రకా రం వెంకట్రావు నియామకం జరగలేదం టూ.. ఆయన ఇచ్చిన నోటీసులను చిన్నప్పన్న హైకోర్టులో సవాల్ చేశారు.
వెంకట్రావు సిట్ సభ్యుడు కాదని, సుప్రీంకోర్టు నియమించలేదని.. ఆయన దర్యాప్తు అధికారిగా కొనసాగడానికి వీల్లేదని.. సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లఘించారని హైకోర్టు జూలై 10న స్పష్టంచేసింది. కేసు దర్యాప్తుపై స్టే విధించింది. ఈ తీర్పును సీబీఐ డైరెక్టర్ గత నెల 5న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్‌వీ అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీబీఐ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ సంపూర్ణంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తోందని.. అందులోని సభ్యులందరితో ఆయన సమావేశమై.. దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారని.. వెంకట్రావును దర్యాప్తు అధికారిగా నియమించడాన్ని ఆయన ఆమోదించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వెంకట్రావును పరిమిత పాత్రలో నియమించారని తెలిపారు. ఎంతో కీలకమైన కేసులో దర్యాప్తు అధికారి నోటీసులిస్తే విచారణకు రానని చెప్పడం సరికాదన్నారు. అయితే.. చిన్నప్పన్నపై వెంకట్రావు ఒత్తిడి చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘అలా ఒత్తిడి చేస్తే, బెదిరింపులు వస్తే ఫిర్యాదు చేయండి. అంతేగానీ. విచారణకే రాబోమని చెప్పడమేంటి’ అని ఆక్షేపించారు. హైకోర్టు ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. చిన్నప్పన్నకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబరు 14కు వాయిదా వేసింది.
సిట్ దర్యాప్తు ఇక వేగవంతం
తిరుపతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరుమల లడ్డూప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కానుంది. సుమారు వంద రోజుల తర్వాత ఒకట్రెండు రోజుల్లో తిరుపతి కేంద్రంగా సిట్ విచారణ తిరిగి మొదలు కానుంది. ఇప్పటికే బాగా ఆలస్యమైన నేపథ్యంలో రెట్టింపు వేగంగా దర్యాప్తును సాధ్యమైన త్వరగా ముగించాలని సీబీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా సిట్ దర్యాప్తుపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడంతో పెండింగ్‌లో ఉన్న నిందితులను, సాక్షుల విచారణ ప్రక్రియ మళ్లీ మొదలు కానుంది.