Share News

Supreme Court: సునీత దంపతులపై కేసు కొట్టివేత

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:12 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Supreme Court: సునీత దంపతులపై కేసు కొట్టివేత

  • సీబీఐ అధికారి రాంసింగ్‌కూ సుప్రీంలో ఊరట

  • చట్టాన్ని దుర్వినియోగ పరచడానికే కేసంటూ ఆగ్రహం

  • వివేకా కేసులో నిందితుల కస్టోడియల్‌ విచారణ,బెయిళ్ల రద్దుపై మీ అభిప్రాయం తెలపండి

  • తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? చెప్పండి

  • సీబీఐని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం

  • అవినాశ్‌రెడ్డి బెయుల్‌ రద్దు చేయండి: లూథ్రా

  • గుండెపోటు అంటూ పెద్ద డ్రామాలాడారు: సీబీఐ

  • ఆ డ్రామాలకు స్వస్తి చెబుతామన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా వారిపై పులివెందుల పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ కేసులను క్వాష్‌ చేస్తున్నట్లు (కొట్టివేత) ప్రకటించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇంకొందరి ప్రమేయం ఉందని చెప్పాలంటూ తనను సునీత, రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌ బెదిరించారని కృష్ణారెడ్డి.. రాంసింగ్‌ తనపై దౌర్జన్యం చేశారని నిందితుడు గజ్జెల ఉదయకుమార్‌రెడ్డి చేసిన ఫిర్యాదుల ఆధారంగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారని.. తమకు అన్యాయం జరిగిందని చెబితే.. అక్రమంగా తమపైనే కేసులు పెట్టారని.. వాటిని కొట్టివేయాలని ఆ ముగ్గురూ దాఖలుచేసుకున్న పిటిషన్లను, హత్య కేసులో నిందితులు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి సహా నిందితులందరి బెయిల్‌ రద్దు చేయాలంటూ సునీతారెడ్డి, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లను.. అన్నిటినీ కలిపి సుప్రీంకోర్టు విచారిస్తోంది. మంగళవారం జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీటిపై విచారణ జరిపింది. సునీతా రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది హుజేఫా అహ్మదీ, నిందితుడు గంగిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.


వివేకా హత్య తీరు అత్యంత దారుణమని, పాశవికంగా చేశారని, ఈ కేసులో దోషులకు మరణశిక్ష పడే అవకాశం ఉందని ఎస్వీ రాజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగిన తీరు చూస్తే నిందితులు రెండేళ్లు, ఐదేళ్లు బెయిల్‌ రాకుండా జైలులో ఉండడం పెద్ద విషయమేమీ కాదన్నారు. వివేకాను హత్య చేసిన తర్వాత ఆధారాలు చెరిపివేయడం, సాక్ష్యాధారాలు లేకుండా చేయడం వంటివి నిరూపితమయ్యాయని తెలిపారు. ముందేమో గుండెపోటు అని, తర్వాతేమో రక్తపు వాంతులని ప్రచారం చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ తదుపరి దర్యాప్తులో బయటికి వచ్చాయని వెల్లడించారు.


కావాలనే ఆ ముగ్గురిని ఇరికించారు: లూథ్రా

సునీత దంపతులతో పాటు సీబీఐ అధికారి రాంసింగ్‌పైనా కుట్ర పూరితంగా కేసు నమోదు చేశారని లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అహ్మదీ కొన్ని కీలక వివరాలను కోర్టు ముందు ఉంచారు. గత ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబరు 15న వివేకా పీఏ కృష్ణారెడ్డితో ఫిర్యాదు చేయించి సునీత, రాజశేఖర్‌రెడ్డి, రాంసింగ్‌ను కావాలనే కేసులో ఇరికించారని, పులివెందుల స్టేషన్‌లో వారిపై ఎఫ్‌ఐఆర్‌ కట్టారన్నారు. లూథ్రా వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ముగ్గురిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను క్వాష్‌(కొట్టివేత) చేస్తున్నట్టు వెల్లడించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసులు పెట్టారని అభిప్రాయపడింది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డే మాస్టర్‌ మైండ్‌ అని లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘వివేకా హత్య కేసును మొదటి నుంచీ తప్పుదారి పట్టించేందుకు అవినాశ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్దిష్టమైన గడువు విధించినందువల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోంది. ఈ కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. మరిన్ని నిజాలు బయటికి రావాలి. పాత్రధారులతోపాటు సూత్రధారులెవరో తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో మరికొందరి పాత్ర ఉన్నట్లు సీబీఐ చార్జిషీటులో స్పష్టం చేసింది. హైకోర్టులోనూ తెలిపింది. అలాంటప్పుడు అర్ధంతరంగా దర్యాప్తును ఎలా ముగిస్తారు? నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారు. సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అప్రూవర్‌ దస్తగిరి జైలులో ఉన్నప్పుడు నిందితుడు శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలుకెళ్లి బెదిరించారు. దీనికి సంబంధించిన ఫొటో సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవినాశ్‌రెడ్డి బయటే ఉంటే కేసును ప్రభావితం చేస్తారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండాచూస్తారు. గతంలో కేసును ఆయన పక్కదారి పట్టించారనడానికి ఎన్నో సాక్ష్యాలు, రుజువులు ఉన్నాయి.


ఇవన్నీ పరిశీలించి అవినాశ్‌ రెడ్డి సహా నిందితుల బెయిల్‌ రద్దు చేయాలి.’’ అని కోరారు. సునీత, రాజశేఖర్‌రెడ్డి, రాంసింగ్‌లపై కుట్రపూరితంగా కేసులు దాఖలు చేశారని, ఇదే విషయంపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం క్లోజర్‌ రిపోర్టులో అన్ని విషయాలను సమగ్రంగా స్పష్టం చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అవినాశ్‌రెడ్డి బలవంతం వల్లే ఆ ముగ్గురిపై కేసులు పెట్టినట్టు విచారణలో పోలీసులు తెలిపారన్నారు. సునీత దంపతులతోపాటు రాంసింగ్‌పై దాఖలైన కేసు వివరాలను అహ్మదీ కోర్టుకు వివరించారు.

తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? చెప్పండి : బెంచ్‌

వివేకా హత్య కేసులో సుమారు గంటకు పైగా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనేది చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగైతే ఎందుకు అవసరం అనేది కూడా స్పష్టంగా తెలియజేయాలని సూచించింది. అలాగే, దర్యాప్తులో భాగంగా నిందితుల కస్టోడియల్‌ విచారణ అవసరమా? లేదా? అనేది కూడా చెప్పాలని ప్రశ్నించింది. నిందితుల్లో ఎంతమంది బెయిల్‌ రద్దు చేయాలో కూడా తెలియజేయాలని తెలిపింది. అయితే, ప్రతిదానికీ ఎందుకు? ఏమిటి? అనేది స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. ఈ సందర్భంగా వివేక హత్య కేసు డ్రామాకు స్వస్తి చెబుతామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.

Updated Date - Aug 20 , 2025 | 08:25 AM