Share News

Supreme Court: రఘురామపై ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేత

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:58 AM

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సర్వోన్నత...

Supreme Court: రఘురామపై ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేత

  • గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2022లో రఘురామ ఎంపీగా ఉన్న సమయంలో గచ్చిబౌలిలోని బౌల్డర్‌ హిల్స్‌లోని ఆయన నివాసం వద్ద ఒక వ్యక్తి (కానిస్టేబుల్‌ ఎస్‌కే ఫరూక్‌ బాషా) అనుమానాస్పదంగా తిరిగారు. ఈ విషయాన్ని సీసీ కెమెరా పుటేజీ ద్వారా గుర్తించిన భద్రతా సిబ్బంది ఆయనను విచారించగా, ఐడీ సహా ఇతర ధ్రువీకరణ కార్డులు చూపించేందుకు నిరాకరించారు. దీంతో అనుమానించి ఆయనను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై రఘురామ పీఏ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని కానిస్టేబుల్‌ ఫరూక్‌ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రఘురామతోపాటు ఆయన కుమారుడు భరత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసును క్వాష్‌(కొట్టివేయాలని) చేయాలని కోరుతూ రఘురామ, భరత్‌లు హైకోర్టును అశ్రయించగా వారి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పుని రఘురామ 2022, జూలై 12న సుప్రీకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌పై సుధీర్ఘ వాదనలు జరిగాయి. సోమవారం జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయిలతో కూడిన ధర్మాసనం రఘురామపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.


  • నాపై తప్పుడు కేసులు పెట్టడంలో నాటి జగన్‌ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధ

  • శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ధ్వజం

తనపై అక్రమ కేసులు బనాయించడంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. తనకులాగే ఎన్నో వేలమందిపై అక్రమ కేసులు పెట్టారని, ఆ కేసుల్లో బాధితులకు ఊరట కలిగించే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేయాలని కోరారు. తనపై మోపిన తప్పుడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గతంలో సీఆర్పీఎఫ్‌ పోలీసుల ఫిర్యాదును బుట్టదాఖలు చేసి, అప్పటి నిఘావిభాగం కానిస్టేబుల్‌ ఫారూఖ్‌ బాష ఫిర్యాదు మేరకు నాపై, నా కుమారుడిపై, సీఆర్పీఎఫ్‌ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన తుది వాదనల్లో ఫారుఖ్‌ బాష ఈ కేసును కొనసాగించడానికితనకు ఆసక్తి లేదని అఫిడవిట్‌ దాఖలు చేశాడని అతడి న్యాయవాదులు చెప్పినట్లు తెలిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఆ కేసు కొట్టి వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఫారూఖ్‌ బాషపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారు. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని కేసు వెనక్కి తీసుకొని ఉంటాడు’’ అని రఘురామ అన్నారు. కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో డీఐజీ స్థాయి అధికారి సునీల్‌ నాయక్‌ను తక్షణమే విచారించాలని రఘురామ అన్నారు.

  • 60 రోజులు గైర్హాజరైతే అనర్హతే..

‘‘సెప్టెంబరు 18 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు హాజరు కావాలి. గతంలో కొంతమంది గైర్హాజరయ్యారు. ఈసారి 60 రోజులపాటు శాసనసభ సమావేశాలు హాజరు కాని శాసనసభ్యులపై అనర్హత వేటు పడుతుంది. శాసనసభ నిర్వహణ, కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ అధికారుల నియామకం కోసం ప్రత్యేక బడ్జెట్‌ ఉండాలి’’ అని రఘురామ చెప్పారు.

Updated Date - Aug 26 , 2025 | 04:59 AM