Share News

Supreme Court: 3 వారాల్లో 7 కోట్లు కట్టండి

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:22 AM

జగన్‌ పాలనలో జరిగిన ఇసుక అక్రమాలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) విధించిన రూ.18 కోట్ల జరిమానాలో రూ.7 కోట్లను ఇప్పుడు చెల్లించాలని జయప్రకాశ్‌ వెంచర్స్‌ పవర్‌ లిమిటెడ్‌.....

Supreme Court: 3 వారాల్లో 7 కోట్లు కట్టండి

న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలనలో జరిగిన ఇసుక అక్రమాలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) విధించిన రూ.18 కోట్ల జరిమానాలో రూ.7 కోట్లను ఇప్పుడు చెల్లించాలని జయప్రకాశ్‌ వెంచర్స్‌ పవర్‌ లిమిటెడ్‌(జేపీ వెంచర్స్‌)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లో చెల్లించడం పూర్తిచేయాలని తేల్చిచెప్పింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎన్‌జీటీ రూ.18 కోట్ల జరిమానా విధించడాన్ని సవాల్‌ చేస్తూ జేపీ వెంచర్స్‌ 2023 మే 15న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. జరిమానా చెల్లింపుపై కోర్టు జూలై 14న స్టే విధించింది. అయితే.. గత విచారణ సందర్భంగా 18 ఇసుక క్వారీల్లో ఏడు క్వారీలకు మాత్రమే తాము పర్యావరణ అనుమతులు తీసుకున్నామని.. 11 ఇసుక క్వారీలకు అప్పడు అధికారంలో ఉన్న ప్రభుత్వమే అనుమతులు తీసుకుందని జేపీ వెంచ ర్స్‌ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఏడింటికి మాత్రమే తాము జరిమానా చెల్లిస్తామని, మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌ దాఖలుచేసింది. ఈ వ్యాజ్యం సోమవారం జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఎన్‌జీటీ విధించిన జరిమానాలో రూ.7కోట్లు చెల్లించేందుకు జేపీ వెంచర్స్‌ అంగీకరించడంతో ఆ మొత్తాన్ని 3 వారాల్లో చెల్లించాలని కోర్టు స్పష్టంచేసింది. మిగిలిన జరిమానాపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామంది. విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.

Updated Date - Dec 16 , 2025 | 03:22 AM