SC Justice Mahadevan: జ్ఞాన విస్తరణకు పుస్తకాలు కీలకం
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:25 AM
జ్ఞాన విస్తరణకు పుస్తకాలు ఎంతో కీలకం.విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు అభ్యాసాన్ని కొనసాగించాలి అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.మహదేవన్ సూచించారు.శ
సమగ్రత లేని విజయం నిజమైనది కాదు
వీఐటీ 40వ స్నాతకోత్సవంలో సుప్రీం జడ్జి జస్టిస్ మహదేవన్
వేలూరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ‘జ్ఞాన విస్తరణకు పుస్తకాలు ఎంతో కీలకం.విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు అభ్యాసాన్ని కొనసాగించాలి’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.మహదేవన్ సూచించారు.శనివారం వేలూరులోని వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) 40వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...‘వీఐటీ తన విద్య,పరిశోధన,పరిపాలనా విధుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించింది.డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం,తిరుక్కురళ్ గురించి ప్రస్తావించిన విషయాన్ని ఉటంకిస్తూ..నిపుణులుగా మారడానికి విలువల పరిజ్ఞానం చాలా అవసరం. సమగ్రత లేని విజయం నిజమైన విజయం కాదు’ అని అన్నారు.
అవినీతి నిర్మూలనకు విద్యార్థులు పోరాడాలి:కులపతి విశ్వనాథన్
‘భారత జీడీపీలో 6 శాతం విద్యకు కేటాయించాలన్నది దీర్ఘకాలిక డిమాండ్.ప్రస్తుతం జీడీపీలో కేవలం 3 శాతం మాత్రమే వ్యయం చేస్తున్నారు.కేంద్రం తన రూ.55 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యకు కేవలం 2.5 శాతం మాత్రమే కేటాయిస్తోంది’ అని వీఐటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ అన్నారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, ‘ప్రస్తుతం ఉన్నతవిద్యలో 4.3 కోట్ల మంది విద్యార్థులు చేరారు.కొత్త విద్యావిధానం 50 శాతం స్థూల నమోదు నిష్పత్తి సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వలన విద్యార్థుల సంఖ్య 8 కోట్లకు పెరుగుతుంది.పన్ను ఎగవేత వల్ల ఏటా రూ.8-9 లక్షల కోట్లు, అవినీతి వల్ల రూ.6 లక్షల కోట్లు కోల్పోతున్నాం. ఈ సమస్యలను నిర్మూలించడానికి విద్యార్థి సమాజం పోరాడాలి’ అని పిలుపునిచ్చారు.కార్యక్రమానికి గౌరవ అతిథిగా టైమ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివకుమార్ సుందరం, వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాథన్,శేఖర్ విశ్వనాథన్, జీవీ సెల్వం, ట్రస్టీ రమణి బాలసుందరం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంధ్య పెంటారెడ్డి, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి ఎస్.విశ్వనాథన్,ఉపకులపతి వీఎస్ కాంచన భాస్కరన్, అసోసియేట్ వైస్ చాన్స్‌లర్ పార్థసారథి మల్లిక్, రిజిస్ట్రార్ టి.జయభారతి తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.పీహెచ్‌డీ డిగ్రీ పొందిన వారిలో తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్ డీజీపీ సందీప్ రాయ్ రాథోడ్ కూడా వుండడం విశేషం.