Share News

AP liquor scam: నాకు నోటీసిచ్చే అధికారం ఏపీసీఐడీకి లేదు

ABN , Publish Date - May 03 , 2025 | 05:24 AM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డిపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ సీఐడీకి మరో రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి నోటీసులు జారీ చేసే అధికారం ఉందా అన్న అంశంపై విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.

AP liquor scam: నాకు నోటీసిచ్చే అధికారం ఏపీసీఐడీకి లేదు

నేను హైదరాబాద్‌లో ఉంటున్నా .. సుప్రీంలో కసిరెడ్డి పిటిషన్‌

ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

న్యూఢిల్లీ, మే 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి(రాజ్‌ కసిరెడ్డి) వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ సీఆర్పీసీ 160 ప్రకారం తనకు నోటీసులు జారీ చేసిందని, హైదరాబాద్‌లో ఉంటున్న తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదంటూ గత నెల 10న రాజ్‌ కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఆ పిటిషన్‌ విచారణకు వచ్చింది. రాజ్‌ కసిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో నివసిస్తున్న రాజ్‌ కసిరెడ్డికి తమ పరిధిని దాటి ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందేననే అధికారం ఏపీ సీఐడీకి లేదని చెప్పారు. మరో రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి నోటీసులు ఇచ్చే అధికారం సీఐడీకి ఉంటుందా? అని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని జస్టిస్‌ జేబీ పార్దివాలా ప్రశ్నించారు. ఏపీ పరిధిలోనే మద్యం కుంభకోణం జరిగిందని, ఎక్కడైనా నోటీసులు ఇచ్చే అధికారం సీఐడీకి ఉంటుందని న్యాయవాది బదులిచ్చారు. ఎక్కడైనా అంటే.. ప్రత్యేకించి మరో రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి నోటీసులు ఇవ్వొచ్చా? లేదా? అన్న దానిపై సమాధానం చెప్పాలని జస్టిస్‌ పార్దివాలా ప్రశ్నించారు. నిందితుడు అరెస్టులో ఉన్నాడా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అరెస్టు అయ్యాడని నిందితుడి తరఫు న్యాయవాది బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సిట్‌, ఎక్సైజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేశ్‌ కుమార్‌ మీనాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ లోపు నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 03 , 2025 | 05:24 AM