Share News

Supreme Court: ఏకపక్షంగా ఎలా కొట్టేస్తారు?

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:14 AM

ఏసీబీ విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌(సీఐయూ)లో నమోదైన 13 ఎఫ్‌ఐఆర్‌లను హైకోర్టు ఒకేసారి ఏకపక్షంగా రద్దు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది....

Supreme Court: ఏకపక్షంగా ఎలా కొట్టేస్తారు?

  • 13 ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ఆగ్రహం

  • చట్టాలను ఇంత దారుణంగా అన్వయించుకుంటారా?

  • ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో కూడా చూడరా?

  • దర్యాప్తులో ఏం జరుగుతోందో పట్టించుకోరా?

  • వాటిపై తదుపరి విచారణ కొనసాగించవచ్చు

  • చార్జిషీట్ల దాఖలుకూ ఏసీబీకి అనుమతి

  • హైకోర్టు ఉత్తర్వులు మరే కేసులకూ వర్తించవు

  • బెంచ్‌ స్పష్టీకరణ.. విచారణ 6 వారాలకు వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏసీబీ విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌(సీఐయూ)లో నమోదైన 13 ఎఫ్‌ఐఆర్‌లను హైకోర్టు ఒకేసారి ఏకపక్షంగా రద్దు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులను ఏకపక్షంగా ఎలా కొట్టేస్తారని నిలదీసింది. చట్టాలను మరీ ఇంత దారుణంగా అన్వయించుకుంటారా అని అసహనం వ్యక్తం చేసింది. కనీసం ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. దర్యాప్తులో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోకపోతే ఎలాగని ఆక్షేపించింది. విజయవాడలోని ఏసీబీ సీఐయూ కార్యాలయాన్ని పోలీసు స్టేషన్‌గా నోటిఫై చేయలేదని.. దీనిపై ప్రభుత్వం ఎలాంటి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయలేదని పేర్కొంటూ.. అక్కడ నమోదైన 13 ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. దీనిని ఏసీబీ ఈ నెల 12న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు రద్దు చేసిన 13 ఎఫ్‌ఐఆర్‌లపై తదుపరి దర్యాప్తు కొనసాగించవచ్చని, చార్జిషీట్లు కూడా దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మరే కేసుకూ వర్తించవని చెబుతూ.. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న 13 మంది.. దాయం పెద రంగారావు, రాచూరి శివరావు, ముమ్మన రాజేశ్వరరావు, రాంపల్లి సత్య ఫణి దత్తాత్రేయ దియాకర్‌, గేదెల రాజశేఖర్‌, గేదెల లక్ష్మీజ్ఞానేశ్వర్‌రావు, సరగధం వెంకటరావు, భట్టు హనుమంతరావు, దొడ్డపనేని వెంకయ్యనాయుడు, బి.సంజీవయ్య, కరణం వెంకట రంగ సాయికుమార్‌, జీఎం వెంకట నారాయణలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.


వాటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు: లూథ్రా

అంతకుముందు.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రావాదనలు వినిపించారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌ కేంద్రంగా సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ పని చేసిందని, దీని పరిధి రాష్ట్రమంతా ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత.. అదే యూనిట్‌ విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలు, నోటిఫికేషన్లు తర్వాత కూడా అమల్లోనే ఉంటాయని విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. గతంలో.. పంజాబ్‌, బిహార్‌ రాష్ర్టాల విభజన కేసుల్లో సుప్రీంకోర్టు ఇటువంటి తీర్పులే ఇచ్చింది’ అని తెలిపారు. ఆ తీర్పుల వివరాలను న్యాయస్థానం ముందుంచారు. హైదరాబాద్‌లో ఉన్న ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ను విజయవాడకు తరలించిన తర్వాత.. పోలీసు స్టేషన్‌ హోదా గురించి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని.. విజయవాడలో యూనిట్‌ ఏర్పాటు చేసిన తదుపరి.. కార్యకలాపాలు సాగించేందుకు ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని.. ఈ అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ లో ఉన్నప్పుడు ఉన్న అధికారాలే విజయవాడకు తరలిన తర్వాతా కొనసాగుతారని గుర్తు చేశారు. సాంకేతిక కారణాలు చూపి ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరలేరని తెలిపారు. ‘ఏసీబీ విభాగంలోని జాయింట్‌ డైరెక్టర్ల కార్యాలయాలను పోలీసు స్టేషన్లుగా గుర్తిస్తూ 2003లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. విభజన చట్టంలోని 101, 102 సెక్షన్ల ప్రకారం.. రాష్ట్ర విభజన అనంతరం ఆ చట్టాలు అమల్లో ఉంటాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పట్టించుకోకుండా హైకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... హైకోర్టు తీర్పుపై పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Sep 17 , 2025 | 04:14 AM