Supreme Court: హైకోర్టునే ఆశ్రయించండి
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:00 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఒక గ్రామంలో దళితులపై వివక్ష చూపుతున్నారని...
లేదంటే ఇతర పరిష్కార మార్గాలను పరిశీలించండి
పిఠాపురం నియోజకవర్గంలో వివక్ష, బహిష్కరణపై దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఒక గ్రామంలో దళితులపై వివక్ష చూపుతున్నారని, సామాజిక బహిష్కరణ విధించారని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టును ఆశ్రయించాలని, లేదంటే అందుబాటులోని ఇతర పరిష్కార మార్గాలను పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. పిఠాపురం రూరల్ పరిధిలోని మల్లం గ్రామంలో జల్లిబాబు ఇంట్లో అదే గ్రామానికి చెందిన దళితుడు పల్లపు సురేష్ కరెంటు పని చేస్తూ ఏప్రిల్ 16న విద్యుతాఘాతంతో మృతిచెందాడు. రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని దళితులు ఆందోళనకు దిగారు. సీఐ సమక్షంలో రూ.2.75 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే, అప్పటికే కొందరు దళితులు ఇలా పనిలో మృతిచెందడం, వారికి పరిహారం చెల్లించాల్సి రావడంతో.. దళితులను ఎవరినీ పనిలోకి పిలవకూడదని జల్లిబాబు సామాజిక వర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో మల్లం గ్రామంలో తమకు హోటళ్లలో టీ, కాఫీ, టిఫిన్ ఇవ్వడం లేదని, నిత్యావసరాలు విక్రయించడం లేదని, పనులకు పిలవడం లేదని దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు అక్కడ పర్యటించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మల్లంలో శాంతి చర్చలు జరిపామని, ఇరువర్గాల వారిని కూర్చోబెట్టి మాట్లాడామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పామని, పరిస్థితి సద్దుమణిగిందని కలెక్టర్ సగిలి షాన్‌మోహన్ ప్రకటించారు. అయితే.. మల్లం గ్రామంలో దళితులపై కుల వివక్షత, సామాజిక బహిష్కరణ ఉందని మే 9న సుప్రీంకోర్టులో దాసరి చెన్నకేశవులు రిట్ పిటిషన్(క్రిమినల్) దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, కాకినాడ కలెక్టర్, పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. దళితుడు చనిపోతే కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, వల్లపు సురేష్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు.
న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా శాంతి చర్చల కమిటీ పేరుతో జరిగిన రాజీని రద్దు చేయాలని, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని విన్నవించారు. రాజ్యాంగబద్ధంగా బాధ్యతలు నిర్వర్తించని స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను బాధ్యుడిని చేయాలని, కలెక్టర్ సహా ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే.. పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ అధికార పరిధికి సంబంధించిన హైకోర్టును, పోలీసు సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని లేదా చట్టంలో అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర పరిష్కార మార్గాలను ఆశ్రయించాలని సూచించిన ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.