Supreme Court: మార్గదర్శిపై హైకోర్టులోనే తేల్చుకోండి
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:42 AM
మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ రిజర్వు బ్యాంకు నిబంధనలను పాటించలేదన్న కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.
అనుబంధ పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు
ఉండవల్లి వాదనలు వినేందుకు విముఖత
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ రిజర్వు బ్యాంకు నిబంధనలను పాటించలేదన్న కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినేందుకు విముఖత చూపించింది. మార్గదర్శి సంస్థ ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విచారణకు ఆదేశిస్తూ ప్రత్యేక జీవో జారీ చేశారు. ఆ జీవోను కొట్టివేయాలని కోరుతూ 2007 ఫిబ్రవరి 9న సంస్థల చైర్మన్ రామోజీరావుతో పాటు, మార్గదర్శి ఫైనాన్షియర్స్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీ ప్రభుత్వం, వైఎస్‌ను ప్రతివాదులుగా చేర్చాయి. ఆ తర్వాత ఉండవల్లితోపాటు మరికొందరు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు గురువారం జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ మార్గదర్శికి సంబంధించిన ప్రధాన రిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అలాగైతే హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. వర్చువల్‌గా విచారణకు హాజరైన ఉండవల్లి అరుణ్ కుమార్ దీనికి అభ్యంతరం తెలిపారు. ఇది కేవలం డిపాజిట్లు, చెల్లింపులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ అవసరమని చెప్పారు. ఇంతలో సిద్దార్థ లూథ్రా కలుగజేసుకుని ఉండవల్లి అసలు ఇందులో ప్రతివాదే కాదన్నారు. ఇప్పటికే డిపాజిట్లు తిరిగి చెల్లించేశారని, మరో రూ.5.34 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మెచ్యూరిటీ తేదీల ఆధారంగా ఆ మొత్తాలను కూడా చెల్లిస్తారని తెలిపారు. ఇరుపక్షాల వాదనల తర్వాత.. ఈ కేసుకు అనుబంధంగా దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.