Special Event: రేపు విజయవాడకు సుప్రీం చీఫ్ జస్టిస్
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:34 AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదివారం విజయవాడకు రానునన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా...
‘75 ఏళ్ల రాజ్యాంగం’పై ముఖ్య అతిథిగా ప్రసంగం
మంగళగిరి, అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదివారం విజయవాడకు రానునన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి సీజేఐ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ‘ఇండియా అండ్ ద లివింగ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొంటారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సెషన్ జడ్జి బి.సాయి కల్యాణ చక్రవర్తి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిదంబరం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం సీ కన్వెన్షన్‌లో ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్‌కలెక్టర్ సంజనా సింహా తదితరులు పాల్గొన్నారు.