Share News

Supreme Court: మూడు వారాల్లోగా లొంగిపోండి

ABN , Publish Date - Aug 01 , 2025 | 03:19 AM

సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌కు సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది. ఆయనకు గతంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. కోర్టు ముందు లొంగిపోవడానికి మూడువారాల సమయం ఇచ్చింది.

Supreme Court: మూడు వారాల్లోగా లొంగిపోండి

  • ఐపీఎస్‌ సంజయ్‌కు సుప్రీం షాక్‌.. ముందస్తు బెయిల్‌ రద్దు

  • ప్రతి కేంద్రంలో 350 మందే ఎలా వస్తారు?

  • ఆ మేరకు ఇన్‌వాయి్‌సలను ఎలా ఇస్తారు?

  • భోజనాలు, వసతి అధికారులే చూశారు కదా?

  • కీలక బాధ్యతల్లో ఉంటే అన్నీ చూసుకోవద్దా?

  • ఇష్టానుసారం చేస్తామంటే ఎలా?

  • నాడు అగ్ని, సీఐడీ విభాగాల అధిపతిగా సంజయ్‌ తీరుపై సుప్రీంకోర్టు ప్రశ్నలు

  • కస్టడీ పిటిషన్‌ దాఖలుకు ఏసీబీకి అవకాశం

‘‘విశాఖపట్నంలో 350 మందికి అవగాహన సదస్సు. రాజమండ్రిలోనూ అంతేమందికి అవగాహన...ఇలా అన్ని కేంద్రాల్లో 350 మంది హాజరు ఎలా సాధ్యం.? 350 మందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని భావిస్తే, చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల కొంతమందైనా గైర్హాజరు అవుతారు కదా? కానీ, ప్రతి కేంద్రంలోనూ 350 మందికి భోజనాలు, ఇతర వసతులు కల్పించినట్టు ఇన్‌వాయి్‌సలు ఉన్నాయి. ఆ మేరకే బిల్లులు డ్రా చేశారు. ఇదెలా సాధ్యం?. కీలక బాధ్యతల్లో ఉండే వ్యక్తులు అన్నీ చూసుకోవాలి కదా?. మా ఇష్టానుసారంగా చేస్తామంటే ఎలా?.’’

- సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌కు సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది. ఆయనకు గతంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. కోర్టు ముందు లొంగిపోవడానికి మూడువారాల సమయం ఇచ్చింది. ఈలోపు సంజయ్‌ను కస్టడీకి తీసుకోవాలనుకుంటే మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేయాలని ఏసీబీ దర్యాప్తు అధికారులకు సూచించింది. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ చీఫ్‌గాను, సీఐడీ అధిపతిగాను సంజయ్‌ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం కూటమి ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై దళితులకు, గిరిజనులకు అవగాహన సదస్సుల పేరిట రూ.కోట్లు దోచేశారని తెలిపింది. ఈ మేరకు సంజయ్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదుచేసింది. ఆ కేసులో ఏపీ హైకోర్టు సంజయ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.


హైకోర్టు తీర్పును ఈ ఏడాది మార్చి 5న ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ అమానుల్లా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌. భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. తొలుత.. సంజయ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత.. ముందు ప్రభుత్వం తరఫున ఏఏస్‌ రాజు వాదనలు వినిపిస్తారని, ఆలోపు మరోసారి ఫైళ్లు సరిచూసుకోవాలని సిబల్‌కు ధర్మాసనం సూచించింది. ఏఎస్‌ రాజు వాదనలు వినిపిస్తూ.. దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల పేరుతో నిబంధనలకు వ్యతిరేకంగా నిధులు కాజేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో అవగాహన సదస్సులు జరిగితే, అందులో 24 ప్రభుత్వ ఆతిథ్యంలోనే జరిగాయని, కేవలం ఒక సదస్సు మాత్రమే ప్రైవేట్‌ ఆతిథ్యంలో జరిగిందని తెలిపారు. 25 ప్రాంతాల్లోనూ సదస్సుల సందర్భంగా స్థానిక అధికారులే వసతులన్నీ కల్పించారన్నారు. అయితే, ఒక పైవ్రేటు సంస్థతో కలిసి సంజయ్‌ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ సమర్పించిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏఎస్‌ రాజు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన బెయిల్‌ను రద్దు చేయడం అవసరమని తెలిపారు.


బాధ్యత ఉండాలి కదా?

ప్రజాధనం వినియోగించేటప్పుడు బాధ్యత ఉండాలి కదా? అని సంజయ్‌ తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘విశాఖపట్నంలో 350 మందికి అవగాహన సదస్సు. రాజమండ్రిలో 350 మందికి అవగాహన సదస్సు. ఇలా.. అన్ని కేంద్రాల్లో 350 మంది హాజరు ఎలా సాధ్యం.? 350 మందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని భావిస్తే.. చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల కొంతమందైనా గైర్హాజరవుతారు కదా? ప్రతికేంద్రంలో 350 మందికి భోజనాలు, ఇతర వసతులు కల్పించినట్టు ఇన్‌వాయి్‌సలు ఉన్నాయి. ఆ మేరకే బిల్లులు డ్రా చేశారు. ఇదెలా సాధ్యం..’’ అంటూ జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్టి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా.. ఒకేరోజు, ఒకే సమయంలో అన్ని కేంద్రాల్లో సదస్సులు జరిగినట్టు తెలపడంపైనా సందేహం వ్యక్తం చేశారు. ఇంతలోనే మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా, ఎవరైనా ఒకరే కౌన్సిల్‌ వాదనలు వినిపించాలని ధర్మాసనం సూచించింది. ఈ నేపథ్యంలో రాజు మళ్లీ వాదనలు కొనసాగించారు. ప్రతి సదస్సులోనూ వీడియోలు, ఫొటోల కోసం డబ్బులు వెచ్చించినట్టు ఇన్‌ వాయి్‌సలో పేర్కొన్నారని, కానీ ప్రతిచోటా సిబ్బందే తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలోనే.. కపిల్‌ సిబల్‌ కలుగజేసుకుని.. ఆయనో ప్రభుత్వ ఉన్నతాధికారి అని, కింది స్థాయి అధికారులు అన్నీ సిద్ధం చేసిన తర్వాత నిబంధనల మేరకే ఆయన సంతకాలు చేశారని తెలిపారు. సిబల్‌ వాదనలపై జస్టిస్‌ భట్టి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మీరు నాకంటే ఎంతో సీనియర్‌. ఇటువంటి ఎన్నో కేసులను వాదించి ఉంటారు. మనం ఏ కార్యక్రమం చేసినా 350 మంది అనుకుంటే.. కనీసం ఒకరిద్దరు అయినా తక్కువగా హాజరవుతారు. ఇది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు కదా? మరి..


అలాంటప్పుడు అన్ని సదస్సులకు 350 మంది ఎలా హాజరయ్యారు? అనే దానికి సమాధానం చెప్పండి’’ అని సిబల్‌ను ప్రశ్నించారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, కొంత సమయం ఇస్తే వివరంగా చెబుతానని సిబల్‌ అన్నారు. దీనిపై బెంచ్‌ స్పందిస్తూ... ‘‘కీలక బాధ్యతల్లో ఉండే వ్యక్తులు అన్నీ చూసుకోవాలి కదా? మా ఇష్టానుసారంగా చేస్తామంటే ఎలా?’’ అని ప్రశ్నించించి. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇక అవకాశం లేదని తేల్చి చెప్పింది. సంజయ్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వడంపై ఇప్పటికే సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే.. సంజయ్‌ కోర్టులో లొంగిపోవడానికి సమయం ఇవ్వాలని కపిల్‌ కోరగా.. ధర్మాసనం, మూడు వారాల సమయం ఇచ్చింది. అదే సమయంలో సంజయ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తే, దర్యాప్తు సంస్థ పిటిషన్‌ దాఖలు చేయవచ్చని పేర్కొంది.

దళితుల సొమ్మును దోచేశారు

వైసీపీ హయాంలో సంజయ్‌ దళితుల పేరిట అడ్డంగా దోచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై వారికి అవగాహన కల్గించడం పేరిట ప్రభుత్వ నిధులను సీఐడీ ఏడీజీ హోదాలో ఆయన దుర్వినియోగం చేశారు. అగ్నిమాపక శాఖలో ఎన్‌వోసీలు ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబ్‌ల కొనుగోళ్ల విషయంలో ఆ శాఖ అధిపతిగా ఆయన భారీ అవినీతికి పాల్పడినట్లు తేలింది. దీనికోసం నియమించుకున్న ప్రైవేటు సంస్థ ఏ పనులు చేయలేదు. కానీ, ఆ సంస్థకు రూ.59.93 లక్షల విలువైన బిల్లులు చెల్లించారు. దీంతో సంజయ్‌పై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జరిపిన విచారణలో సంజయ్‌ అవినీతి బాగోతం బయట పడింది. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు పలు కల్యాణ మండపాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రూ.1.19కోట్లు ఖర్చు చేసినట్లు, క్రిత్వాప్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థకు బిల్లులు చెల్లించినట్లు సంజయ్‌ చూపారు. అయితే ఎక్కడా కల్యాణ మండపాల్లో సమావేశాలు నిర్వహించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహించారు. టీ, బిస్కట్లు ఇచ్చి భోజనాలు పెట్టినట్లు చూపించి కోటి రూపాయలకు పైగా నిధులు కాజేశారంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Updated Date - Aug 01 , 2025 | 03:21 AM