Share News

AP CM Chandrababu Naidu: అన్నదాతకు అండ

ABN , Publish Date - Nov 08 , 2025 | 04:33 AM

అన్నదాతలకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని, సాగుకు సాయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

AP CM Chandrababu Naidu: అన్నదాతకు అండ

  • ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకు 25 వేలకు పెంచాం

  • వరదలు, విపత్తులలో ఆదుకుంటున్నాం

  • ధాన్యం కొన్న 24 గంటల్లోనే చెల్లింపు

  • రాయలసీమలో సబ్సిడీ ‘డ్రిప్‌’ పునరుద్ధరణ

  • అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు సాయం

  • రైతాంగం టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

  • ప్రకృతి సాగుకు అగ్రిటెక్‌ జోడిస్తే మంచి ఫలితాలు

  • ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించండి

  • కాలానికి తగినట్టు పంటల సాగు మారాలి

  • గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయంపై నిర్లక్ష్యం

  • ఆచార్య రంగా 125వ జయంతిలో చంద్రబాబు

ఇప్పుడు ప్రపంచ ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఒకప్పుడు రాగులు, సజ్జలు, జొన్నలు తినేవారు. రూ.2 కేజీ బియ్యంతో రాయలసీమలో అన్నం తినే పరిస్థితి ప్రారంభమైంది. ఈ రోజు వరి అన్నం తినేవారు తగ్గిపోతున్నారు. అందుకు తగినట్టుగా రైతాంగం మారాలి. ఆ మార్పు కోసమే రాయలసీమను ఉద్యాన, కోస్తాంధ్రను ఆక్వాకల్చర్‌ హబ్‌లుగా చేస్తున్నాం. వాణిజ్య పంటలకు రైతులు అధిక ప్రాధాన్యం ఇచ్చి, సాగు చేసే పంటల్లో మార్పులు చేసుకోవాలి.

- సీఎం చంద్రబాబు

గుంటూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని, సాగుకు సాయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పంటల సాగులో ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఒకప్పుడు మన రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉండేదన్నారు. ఇప్పుడు అక్కడ శాంపిల్స్‌ పరీక్షిస్తూ పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉంటే తిరస్కరిస్తున్నారని అన్నారు. దీంతో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంతో ముందుకు పోతున్నామని, దీనికి త్వరలోనే అగ్రిటెక్‌ను జోడించి మంచి ఫలితాలు రాబడతామని చెప్పారు. రైతులు కూడా పురుగుమందులు విక్రయించే దుకాణాల యజమానుల మాటలు వినకుండా అవసరమైతేనే వాటిని వినియోగించాలని కోరారు. ఇప్పుడు డ్రోన్లు వచ్చాయని, వాటితో పంటలపై సర్వే చేయించి ఎక్కడైతే పురుగు సోకిందో అంతవరకే పురుగుమందులు పరిమిత మోతాదులో పిచికారి చేసేలా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. శుక్రవారం ఆచార్య ఎన్‌జీ రంగా 125వ జయంతి వేడుకలు గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగాయి.


ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వ్యవసాయ రంగానికి రంగా చేసిన సేవలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. మనిషికి తరచుగా ఆరోగ్య పరీక్షలు ఎలా అవసరమో, అలానే భూమికి కూడా సూక్ష్మపోషకాల స్థితిని తెలుసుకొనేందుకు భూసార పరీక్షలు అవసరమని అన్నారు. పరీక్షలలో లోపాలు బయట పడతాయని, వాటిని సరి చేసుకుంటే సారవంతమైన భూమి సేద్యానికి అందుబాటులోకి వస్తుందని సూచించారు.


వైసీపీ హయాంలో సాగు తిరోగమనం

‘‘రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతుకు స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత కూడా ఇబ్బందులున్నాయి. రైతులంతా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంపై దృష్టిసారించాలి. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయాయి. ఖర్చులు తగ్గించి ఉత్పత్తి పెంచగలిగితేనే రైతుకు ఆదాయం పెరుగుతుంది. దీనిపై శాస్త్రవేత్తలు, ఎన్‌జీ రంగా శిష్యులు పరిశోధనలు చేయాలి. రైతులను అన్నివిధాలుగా బాగు చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తలసరి ఆదాయం, జీఎ్‌సడీపీలో వ్యవసాయ రంగం వాటా టీడీపీ ప్రభుత్వంలోనే ఎక్కువగా ఉంటుంది. 2014-19లో జీఎ్‌సడీపీలో 16.65 శాతం పెరిగింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో 10 శాతం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 2024-25లో మళ్లీ 15.45 శాతానికి పెంచాం. జీఎ్‌సడీపీ పెరిగితేనే రైతుకు ఆదాయం పెరుగుతుంది. 2023-24 ఖరీఫ్‌, రబీలో 48 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చి వైసీపీ ప్రభుత్వం మిగతా మొత్తాన్ని బకాయిలు పెట్టింది. రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. మేము వస్తూనే రూ.1674 కోట్ల బకాయిలు చెల్లించాం. 2024-25లో 55 లక్షలా 79 వేల టన్నుల ధాన్యాన్ని రూ.12,857 కోట్లకు కొనుగోలు చేసి, 8 లక్షల మంది రైతులకు 24 గంటల్లో నగదు చెల్లింపు చేశాం. ఆర్థిక సమస్యలున్నా రైతులకు ఇబ్బంది రాకూడదని వ్యవసాయ ఉత్పత్తులు సేకరించిన 24 గంటల్లోనే నేరుగా బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.


పంటల బీమాపై దుష్ప్రచారం నమ్మొద్దు

‘‘వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.7,500 ఇస్తే, ఇప్పుడు రూ.14 వేలు చేశాం. కేంద్రం రూ.6 వేలు ఇస్తున్నది. రెండూ కలిపి రూ.20 వేలు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద ఇటీవలే రూ.3,174 కోట్లు ఇచ్చాం. మరోవైపు ఇటీవల వరదలు వస్తే ఎక్కువగా కౌలు రైతులు నష్టపోయారు. నేరుగా ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ కౌలురైతులకే ఇచ్చాం. వరదలు, విపత్తులు వచ్చినప్పుడు రైతులను ఆదుకుంటున్నాం. గతంలో హెక్టారుకు రూ.20 వేల నష్టపరిహారం ఇస్తే, దానిని వైసీపీ ప్రభుత్వం రూ.15 వేలకు తగ్గించింది. ఇప్పుడు మేము రూ.25 వేలకు పెంచాం. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పంటల బీమా కట్టలేదు. పార్లమెంట్‌లో ఒకసారి కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ విషయంపై మాట్లాడుతూ.. పంటల బీమా కవరేజీలో మూడేళ్లు రాష్ట్ర వాటా ఎగ్గొట్టిందని చెప్పారు. మేము వస్తూనే పంటల బీమా 95శాతం కట్టాం. మిగిలిన 5శాతం 12లోపు చెల్లిస్తాం. ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత తీసుకొంటాం. రైతులకు గిట్టుబాటు ధర పడిపోయినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకోసం మామిడికి రూ.249 కోట్లు, పొగాకుకు రూ.273 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, కాఫీకి ఎకరానికి రూ.5 వేలు, మిర్చికి రూ.130 కోట్లు, టమోటాకు రూ.12 కోట్లు, ఉల్లికి హెక్టారుకు రూ.50 వేల చొప్పున రూ.100 కోట్లు కేటాయించాం. రాయలసీమలో గతంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఆపేస్తే ఈ రోజున మళ్లీ ఇస్తున్నాం. ఎస్‌సీ, ఎస్‌టీలకు 100 శాతం రాయితీ, సాధారణ రైతులకు 50 నుంచి 90 శాతం రాయితీ ఇస్తున్నాం’’ అని వివరించారు.


పావలా వడ్డీకే రుణాలు

‘‘కౌలు రైతులు ఒక్కోసారి ఎక్కువ పొలం తీసుకొని అప్పులు చేసి వాటిని తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంత వ్యవసాయం చేయగలుగుతారో అంతే భూమిని కౌలుకు తీసుకోవాలి. ఏ ఒక్క రైతూ అధైర్యపడొద్దు. ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ప్రతీ విషయంలో అండగా ఉంటాం. రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకొన్న అన్ని జాగ్రత్తల వల్ల చెరువులు, రిజర్వాయర్లన్నింటిని 95 శాతం నింపాం. రాష్ట్రంలో 1100 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా, 1000 టీఎంసీల నీరు నేడు నిల్వ ఉంది. గత వైసీపీ హయాంలో రిజర్వాయర్ల గేట్లు కూడా రిపేర్లు చేసేవారుకాదు. ఈ రోజున ముందుజాగ్రత్తగా నిధులు ఖర్చు పెట్టి రిపేర్లు చేస్తున్నాం. ఇటీవల మొంథా తుఫాను వచ్చినపుడు టెక్నాలజీని కచ్చితత్వంతో వినియోగించి ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాం’’ అని చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు, శాస్త్రవేత్తలు, ట్రస్టీ రామినేని కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


పంజాబ్‌ నుంచి రోజూ రెండు రైళ్లలో క్యాన్సర్‌ రోగులు ఢిల్లీకి

ఒకప్పుడు పంజాబ్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దేశానికి ధాన్యాగారాలుగా ఉండేవని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఈ రెండుచోట్ల నుంచే బియ్యం ఎగుమతి జరిగేవని తెలిపారు. ‘‘నేడు ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారాన్ని కోరుకుంటున్నారు. అన్నం తినడం చాలావరకు తగ్గించేశారు. ఇంకోవైపు పంజాబ్‌ నుంచి నేడు నిత్యం రెండు రైళ్లు క్యాన్సర్‌ రోగులతో ఢిల్లీకి వైద్య చికిత్సల కోసం వెళుతున్నాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. రైతులు కూడా ప్రజల ఆహారపు అలవాట్లకు తగిన పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. అందుకే తమ ప్రభుత్వం రాయలసీమని ఉద్యాన హబ్‌, కోస్తాంధ్రని ఆక్వా హబ్‌గా అభివృద్థి చేయనుందన్నారు. అలానే వాణిజ్య పంటల సాగుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు.


నాపై ఎన్‌జీ రంగా ప్రభావం

‘‘రైతు గౌరవం... దేశ గౌరవం. రైతు అభివృద్ధి... దేశ అభివృద్ధి అని ఆచార్య ఎన్‌జీ రంగా తన జీవితాంతం చెబుతుండేవారు. ఆయన ఎన్నో స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు పార్లమెంట్‌ లోపల, బయట చేశారు. అవన్నీ నాపై ప్రభావం చూపాయి. నేను పీహెచ్‌డీ చేసేటప్పుడు రంగా ప్రసంగాలను స్ఫూర్తిగా తీసుకొన్నాను. 150 ఏళ్ల క్రితం వందేమాతరం గీతం రచించిన రోజు నవంబరు 7. ఆ సంవత్సరం కాకపోయినా అదే రోజున ఎన్‌జీ రంగా పుట్టినరోజు. ఇది యాదృచ్చికమైనా ఒక చరిత్ర. స్వాతంత్య్ర సమరయోధుల్లో అగ్రస్థానంలో ఆచార్య ఎన్‌జీ రంగా నిలుస్తారు. ఆయన గుంటూరులోని ఏసీ కళాశాల నుంచి ఆక్స్‌ఫర్డ్‌ వరకు విద్యను అభ్యసించి ఆర్థిక శాస్త్రంలో పట్టా పుచ్చుకొన్నారు. రైతుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. 33 ఏళ్ల వయసులోనే రైతుల ఉద్యమాన్ని నడిపించిన ధైర్యశాలి. 17వ రాజ్యాంగ సవరణను గట్టిగా వ్యతిరేకించి రైతు ప్రయోజనాలను కాపాడిన మహనీయుడు. రంగా ఒత్తిడికి పార్లమెంట్‌లో నెహ్రూనే తలొగ్గేవారు. ఆయన పార్లమెంట్‌లో ఉంటే రైతు హాయిగా నిద్రపోయేవాడన్న నానుడి ఉండేది. అనేక పుస్తకాలు రచించారు. 50 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్‌గా సేవలందించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్‌జీ రంగా, ఆయన సతీమణి భారతిదేవి ఆదర్శంగా నిలిచారు. తాము పిల్లలను కంటే స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి బలహీనపడుతుందేమోనని పిల్లల్ని కూడా కనలేదు. ఆ తర్వాత నాగేశ్వరరావు అనే వ్యక్తిని దత్తత తీసుకొన్నారు. ఆయన, నేను ఒకేసారి మంత్రులమయ్యాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 06:29 AM