CM Chandrababu: కొబ్బరి రైతులకు అండగా నిలవండి
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:53 AM
ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించి, వారి ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతునివ్వాలని...
కొబ్బరి అభివృద్ధికి200 కోట్లు ఇవ్వండి
కేంద్ర వ్యవసాయ మంత్రికి సీఎం లేఖ
న్యూఢిల్లీ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించి, వారి ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతునివ్వాలని కేంద్రప్రభుత్వానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న సమీకృత కొబ్బరి అభివృద్ధి, మార్కెట్ బలోపేత కార్యక్రమం(ఇంటిగ్రేటెడ్ కోకోనట్ డెవల్‌పమెంట్ అండ్ మార్కెట్ స్ట్రెత్‌నింగ్ ప్రోగ్రామ్)కు సత్వరమే రూ.200 కోట్లు ఆర్థికసాయం అందించాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌కు లేఖ రాశారు. ‘దేశంలో కొబ్బరి సాగులో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. అయితే సరైన మార్కెటింగ్ లేక, దళారుల దోపిడీ వల్ల రైతులకు కాయకు రూ.11-15 మించి రావడం లేదు. ఈ పరిస్థితిని మార్చి రైతుకు కాయకు రూ.35-40 వచ్చేలా చూడడమే తమ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం రైతులకు లాభమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో 15 వేల మందికి ప్రత్యక్షంగా, 40 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నాం. కొబ్బరి సాగు విస్తీర్ణాన్ని 2 లక్షల హెక్టార్లకు పెంచడంతో పాటు, అంతరపంటగా కోకోసాగును ప్రోత్సహించనున్నాం’ అని సీఎం లేఖలో పేర్కొన్నారు.