Minister Satya kumar: నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:01 AM
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
జగ్గయ్యపేట, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. మంగళవారం ఆయన జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, ప్రభుత్వాస్పత్రుల పటిష్ఠంతో పాటు వ్యక్తిగతంగా రూ. 25 లక్షల వరకు వైద్య సాయం అందించే ఆలోచన ఉందన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 7వేల అడ్మిషన్లు వస్తున్నాయని, గత ప్రభుత్వ హయాంలో కంటే అదనంగా 2 వేల అడ్మిషన్లు పెరిగాయన్నారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఔషధ సరఫరా సంస్థలకు రూ. వెయ్యి కోట్లు, ఆస్పత్రులకు రూ.2,500 కోట్లు బకాయి పెట్టిందని, వాటిని తమ ప్రభుత్వమే తీర్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఆస్పత్రుల స్థాయిని బట్టి 105 నుంచి 712 రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు.