YS Sharmila: సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్
ABN , Publish Date - Aug 17 , 2025 | 06:09 AM
సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శనివారం ఈమేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
హామీల అమలు అరచేతిలో వైకుంఠమే: షర్మిల
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శనివారం ఈమేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని సీఎం చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. ‘ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా? పద్దెనిమిదేళ్లు నిండిన ఒక్క యువతికైనా నెలకు రూ.1,500 అందజేశారా? కేంద్రం ఇచ్చిన రూ.ఆరు వేలతో లింకు పెట్టి.. రాష్ట్రంలోని ఇరవై లక్షల మంది రైతులకు సున్నం పెట్టారు. తల్లికి వందనంలో ఇరవై లక్షల మంది తల్లులకు కోతపెట్టారు. 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు పథకం అమలుచేసి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటారా? రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది. అభివృద్ధి అటకెక్కింది. సుపరిపాలన కొండెక్కింది. కూటమి ఏడాది పాలనలో హామీల అమలుకు మంగళం పాడింది’ అని షర్మిల విమర్శించారు.