Share News

Minister Pyyavula Keshav: సూపర్‌ జీఎస్టీ.. సూపర్‌ సేవింగ్స్‌

ABN , Publish Date - Oct 07 , 2025 | 04:56 AM

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ-2.0 సంస్కరణల వల్ల దేశంలో సామాన్యులపై రూ.2 లక్షల కోట్ల భారం తగ్గిందని ఆర్థిక...

Minister Pyyavula Keshav: సూపర్‌ జీఎస్టీ.. సూపర్‌ సేవింగ్స్‌

  • 16న కర్నూలులో భారీ బహిరంగ సభ

  • జీఎస్టీ-2.0పై దేశంలోనే తొలిసారి నిర్వహణ

  • ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంలు హాజరు: మంత్రి పయ్యావుల వెల్లడి

  • కర్నూలులో సభ ఏర్పాట్లు పరిశీలించిన బృందం

కర్నూలు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ-2.0 సంస్కరణల వల్ల దేశంలో సామాన్యులపై రూ.2 లక్షల కోట్ల భారం తగ్గిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ‘సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌’ పేరిట జీఎస్టీపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 16న కర్నూలులో 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహా కూటమి పార్టీల జాతీయ, రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు. అదేవిధంగా జీఎస్టీ-2.0 ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలి భారీ బహిరంగ సభకు కర్నూలు నుంచే శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు.. ఈ సభను దిగ్విజయం చేసేందుకు మంత్రులు టీజీ భరత్‌, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, ప్రధానమంత్రి కార్యక్రమాల స్పెషల్‌ కో-ఆర్డినేటర్‌ వీరపాండియన్‌లతో కూడిన బృందం సోమవారం కర్నూలులో పర్యటించి సభ నిర్వహించే స్థలం, ఏర్పాట్లను పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. ‘‘జీఎస్టీ-2.0 సంస్కరణలపై దేశంలోనే తొలిసారిగా కర్నూలులో నిర్వహించే సభకు ప్రధాని హాజరు కానున్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతున్నాయి’’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ నాగరాజు, ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 04:57 AM