GST 2.0: సేవింగ్స్‌కు సూపర్ మస్కా
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:09 AM
సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ అంటూ ప్రభుత్వం నెలరోజులపాటు రూ.కోట్లు ఖర్చు పెట్టి చేసిన ప్రచార హడావుడి వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. దసరా నుంచి దీపావళి వరకు...
రిటైలర్ల మాయలో జీఎస్టీ పొదుపు ఆవిరి
కొత్త సంస్కరణల అమలుతో ప్రభుత్వం కోల్పోయే ఆదాయమూ వాళ్ల జేబుల్లోకే!
ధరల్లోని తేడా తెలిపే బోర్డులు లేవు
పాత స్టాక్ అంటూ అవే ధరలకు అమ్మకం
డిస్కౌంట్ ఇస్తున్నామంటూ బాదుడు
ఆరోగ్యంపై భారీగా తగ్గిన జీఎస్టీ
మెడికల్ షాపుల్లో ఆ మేరకు తగ్గని భారం
పాత ధరలకే నిత్యావసరాల విక్రయం
షోరూమ్‌లు, సూపర్ మార్కెట్లలోనే కొత్త ధరలు
కొత్త విధానం వచ్చి 50 రోజులైనా చర్యల్లేవు
ఆకస్మిక తనిఖీలు, విజిలెన్స్ దాడులెక్కడ?
‘‘సూపర్ జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రానికి ఏడాదికి రూ.8 వేల కోట్ల నష్టం వస్తుంది. ఆ మేరకు ప్రజలకు ఆదా అవుతూ, వారి జీవనశైలి మెరుగుపడుతుంది కాబట్టి, జీఎస్టీ 2.0 సంస్కరణలను ఆహ్వానిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్షేత్రస్థాయిలో చూస్తే జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఎలాగూ నష్టమే వస్తుంది. కానీ, ముఖ్యమంత్రి ఆశించినట్టు ఆ డబ్బు పొదుపు రూపంలో ప్రజలకు కూడా మిగలడం లేదు. కొత్త సంస్కరణల అమలుతో ప్రభుత్వం కోల్పోయే ఆదాయం, సామాన్యుల సేవింగ్స్... రెండూ రిటైల్ మార్కెట్ల మాయాజాలంతో ఆవిరైపోతున్నాయి.
జీఎస్టీ సంస్కరణలకు ముందున్న ధరలు, తర్వాతి ధరల్లోని వ్యత్యాసం తెలిపే బోర్డులు ఏవో కొన్ని దుకాణాల వద్ద తప్ప.. దాదాపుగా ఎక్కడా కనిపించడంలేదు. సూపర్ జీఎస్టీపై ప్రభుత్వ ప్రచార ప్రభావంతో ఎవరైనా.. ‘రేట్లు తగ్గించరా..’ అని అడిగితే.. పాతస్టాక్ అని.. పరిమాణం పెరిగిందని.. డిస్కౌంట్ ఇస్తున్నామని.. ఈ వస్తువుపై తగ్గింపు లేదంటూ కిరాణాషాపులవాళ్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ అంటూ ప్రభుత్వం నెలరోజులపాటు రూ.కోట్లు ఖర్చు పెట్టి చేసిన ప్రచార హడావుడి వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. దసరా నుంచి దీపావళి వరకు 65,000 అవగాహన సమావేశాలతోపాటు, ప్రభుత్వం జీఎస్టీ సంబరాలు కూడా నిర్వహించింది. ఖజానాకు రూ.8 వేల కోట్ల నష్టమైనా పర్లేదు.. ఆ మేరకు ప్రజలకు ఆ డబ్బు ఆదా అవుతుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. కానీ, ఆ వేల మీటింగులూ, రూ.కోట్ల ఖర్చూ, నెల రోజుల సంబరాలూ సామాన్యులకు సూపర్ జీఎస్టీ ప్రయోజనాలు కల్పించడంలో విఫలమయ్యాయి. సూపర్ జీఎస్టీ అమల్లోకి వచ్చినా సేవింగ్స్ మాత్రం కనపడడం లేదు. ప్రజలు ప్రతి రోజు ఉపయోగించే మందులు, నిత్యావసరాలపై తగ్గిన పన్ను ప్రయోజనాలు రిటైల్ మార్కెట్లోనే ఆగిపోతున్నాయి. ముఖ్యంగా మెడికల్ షాపుల్లో దోపిడీ ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు చోట్ల మినహాయిస్తే ఎక్కడా కూడా పాత, కొత్త ధరల బోర్డులు లేవు. ఎలక్ర్టానిక్స్, కార్లు, బైకుల షోరూములు, డీమార్ట్, మోర్, రిలయన్స్ లాంటి జాతీయస్థాయి సూపర్‌మార్కెట్లలో తప్ప ఎక్కడా.. జీఎస్టీ తగ్గింపు రేట్లు ప్రజలకు అందడం లేదు.
తగ్గని మందుల ధరలు
రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపుల్లో తగ్గిన జీఎస్టీ రేట్లు అమలు కావడం లేదు. వైద్యుడు రాసిన ఈ మందులకు జీఎస్టీ తగ్గింపు వర్తించదని చెప్తున్నారు. బయటి మెడికల్ షాపులవాళ్లు ఇప్పటికే 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప రేట్లు తగ్గించడం లేదు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా.. క్యాన్సర్, జన్యుసంబంధిత, అరుదైన వ్యాధులు, గుండె జబ్బులకు వినియోగించే 36 ప్రాణాధార ఔషధాలపై పన్ను పూర్తిగా తొలగించారు. వైద్యం కోసం ఉపయోగించే బ్యాండేజ్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. మరెన్నో ఔషధాలు, వైద్య పరికరాల పన్నులు తగ్గించారు. దేశంలో వైద్యసేవల ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కానీ, ఆస్పత్రి బిల్లుల్లోగానీ, మందుల బిల్లుల్లో గానీ తగ్గింపు కనిపించడం లేదు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్కచోట కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆకస్మిక తనిఖీలుగానీ, విజిలెన్స్ దాడులుగానీ జరగకపోవడం ఆశ్చర్యకరం.
పాత ధరలకే అమ్మకాలు
రాష్ట్రవ్యాప్తంగా పేరుమోసిన పెద్దపెద్ద సూపర్ మార్కెట్లలో మాత్రమే జీఎస్టీ తగ్గింపు అమలవుతోంది. కానీ, ఇక్కడ కొనే వారెంతమంది? కేవలం సిటీల్లో మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి. మిగతావాళ్లంతా కిరాణా షాపుల్లో కొనుక్కుంటారు. కిరాణా వ్యాపారులు పాతస్టాక్....పాత ధరలకే హోల్‌సేల్‌గా కొన్నామంటూ ధరలు తగ్గించడం లేదు. లేదా పరిమాణం పెంచామంటూ చెబుతున్నారు. పాలు, ఆహారపదార్థాలు, నిత్యావసరాల్లో ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ తగ్గిందన్న ఒక్క బోర్డు కూడా ఎక్కడా కనిపించడం లేదు. దుకాణదారులు చెప్పిందే రేటు. నిత్యావసరాలకు సంబంధించి రిటైల్ మార్కెట్లో జీఎస్టీ తగ్గింపు అమలు కావడం లేదు. ఉదాహరణకు విజయవాడలో 250 ఎంఎల్ కూల్‌డ్రింక్ ధర గతంలో రూ.20 ఉండేది. జీఎస్టీ తగ్గింపు వల్ల దీని ధర రూ.18కి తగ్గింది. ఎమ్మార్పీ రూ.18 అని ఉన్నప్పటికీ కూడా రిటైలర్లు రూ.20కే విక్రయిస్తున్నారు. లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.13.36కి తగ్గింది. కానీ, రిటైల్ మార్కెట్లో ఇంకా రూ.20కే విక్రయిస్తున్నారు. ఇలాంటివి కోకొల్లలు. స్టేషనరీ, వస్త్రాలు, పాదరక్షలు బయట షాపుల్లో అయినా, ఆన్‌లైన్‌లో అయినా ధరలు తగ్గించడం లేదు. షాపుల వద్ద గానీ, ఆన్‌లైన్ పోర్టల్స్‌లోగానీ పాత, కొత్త ధరల బోర్డులు కనిపించడం లేదు. ఎవరైనా అడిగితే పండగ ఆఫర్లు అమల్లో ఉన్నాయి.. ప్రత్యేక డిస్కౌంటు ఇస్తున్నాం.. మొత్తం బిల్లుపై 5 శాతం తగ్గిస్తున్నామంటూ చెబుతున్నారు. జీఎస్టీ 2.0 రాకముందు ఉన్న స్టాక్‌పై సవరించిన ఎమ్మార్పీని స్టాంపింగ్, స్టిక్కర్, ఆన్‌లైన్ ప్రింటింగ్ ద్వారా మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ, ఇవి ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు.
ప్రభుత్వానికీ, ప్రజలకూ నష్టమే
ప్రజలు నిత్యం వాడే ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులైన టూత్‌బ్ర్‌ష, టూత్‌పే్‌స్ట, సబ్బులు, షాంపూలు, తలనూనెలు, టాల్కమ్ పౌడర్, షేవింగ్ క్రీమ్‌తోపాటు, నెయ్యి, పన్నీరు, బటర్, నమ్కీన్, కెచప్, డ్రైఫ్రూట్స్, కాఫీ పౌడర్‌లను పాత ధరలకే రిటైలర్లు విక్రయిస్తున్నారు. చట్టప్రకారం ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు అందకపోయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. జీఎస్టీ ప్రయోజనాలు కొనుగోలుదారులకు దక్కుతున్నాయా లేదా అని తెలుసుకొనే వ్యవస్థలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై స్పష్టత లేదు.
జీఎస్టీ మోసాలపై ఫిర్యాదులకు..
జీఎస్టీ మోసాలపై ఫిర్యాదులను టోల్‌ఫ్రీ నంబర్ 1915 ద్వారా తెలియజేయొచ్చు. 17 భాషల్లో ఈ అవకాశం ఉంది. పోర్టల్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సృష్టించుకుని ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. ఇందులో వినియోగదారులు తమ ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. 88000 01915 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపిస్తే వినియోగదారులను హెల్ప్‌లైన్ వారు సంప్రదిస్తారు. ఇదే నంబర్‌కు వాట్సప్ ద్వారా కూడా సమాచారం పంపించొచ్చు. ఉమంగ్ యాప్, ఎన్‌సీహెచ్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. జీఎస్టీ సంస్కరణల తర్వాత అక్టోబరు మొదటివారం వరకు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు 3981 మంది ఫిర్యాదు చేశారు. అత్యధికంగా పాలరేట్లు తగ్గలేదంటూ ఫిర్యాదులు వచ్చాయి.