Sunitha Reddy: కలిసి తిరిగినవాడే చంపించాడంటే నమ్మలేకపోయా
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:02 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (నాన్న) జయంతి రోజు ఆయన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. ఎప్పుడూ మాతోనే తిరుగుతున్న వ్యక్తి (వైఎస్ అవినాశ్‌రెడ్డి)..
అవినాశ్‌రెడ్డిని మంచి లీడర్‌గా చేయాలని వివేకా అనేవారు
అలాంటి వ్యక్తే నాన్నను హత్య చేయించడం దారుణం
నాన్న అంతిమ యాత్ర చేద్దామంటే జగనన్న వద్దన్నారు
నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలిందని పులివెందులలో పెద్ద ర్యాలీ చేశారు
వివేకా కుమార్తె సునీత ఆవేదన
పులివెందుల/పులివెందుల రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (నాన్న) జయంతి రోజు ఆయన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. ‘ఎప్పుడూ మాతోనే తిరుగుతున్న వ్యక్తి (వైఎస్ అవినాశ్‌రెడ్డి).. నాన్నను హత్య చేయించాడంటే నమ్మలేకపోయా’నని చెప్పారు.శుక్రవారం వివేకా 74వ జయంతి సందర్భంగా పులివెందులలోని ఇంటి వద్ద ఉన్న తండ్రి విగ్రహానికి భర్త రాజశేఖర్‌రెడ్డి,తల్లి సౌభాగ్యమ్మతో కలిసి ఆమె నివాళులర్పించారు.వివేకా సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం సునీత విలేకరులతో మాట్లాడారు.‘నాన్న చనిపోయినప్పుడు ఖననం చేసేందుకు ఇంటి నుంచి ర్యాలీగా వెళ్దామని చెబితే అప్పుడు జగనన్న వద్దన్నారు.నిన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ప్రచారంలో జరిగిన గొడవలో ఒక కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలితే పెద్ద ర్యాలీ చేశారు.అవినాశ్‌రెడ్డిని మంచి లీడర్‌గా చేయాలని,మంచి భవిష్యత్ ఉందని నాన్న ఎప్పుడూ అనేవారు. అలాంటి వ్యక్తిని మాతో తిరిగిన, మాతో ఆడుకున్న అవినాశ్‌రెడ్డే హత్య చేయించడం దారుణం.నిన్న కార్యకర్తకు దెబ్బ తగిలిందని సతీశ్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి పులివెందుల డీఎస్పీతో వాదనకు దిగారు.పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. మరి నాన్న హత్య జరిగినప్పుడు సంఘటనాస్థలంలో సమయంలో పోలీసుల సమక్షంలో రక్తపు మరకలు చెరిపేసి మీరు శుభ్రం చేయలేదా? అప్పుడు మీకు పోలీసులు తొత్తులా? వివేకాను ఆదినారాయణరెడ్డి,సతీశ్‌రెడ్డి, బీటెక్ రవి హత్య చేయించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసే విషయమై అవినాశ్‌రెడ్డి కాగితం మీద రాసుకొచ్చారు.దానిపై సంతకం చేయాలని కోరారు. అయితే నేనొప్పుకోలేదు.నాన్న హత్య జరిగి ఆరేళ్లయింది. నేటికీ న్యాయం జరగలేదు.హైకోర్టులో 6 కేసులు,సుప్రీంకోర్టులో 6 కేసులు నడుస్తున్నాయి.న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా’అని ఆమె తెలిపారు.
వివేకాను చంపించింది అవినాశ్‌రెడ్డే
మాపై నిందలు వేశారు: ఎమ్మెల్యే ఆది
పులివెందుల, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డే హత్య చేయించారన్నది అందరికీ తెలిసిందేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా పులివెందులలో వివేకా నివాసానికి వెళ్లి ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిలను పరామర్శించారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయంగా వైఎస్ కుటుంబంతో విబేధాలు ఉన్నాయే కానీ మనిషిని హత్య చేసేంత ఉద్దేశాలు తమకు లేవన్నారు.అవినాశ్‌రెడ్డి కుట్రపూరితంగా వివేకాను హత్య చేయించి తమపై వేసేందుకు చూశారని ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత స్పందిస్తూ..ఆ రోజు ఈయన్న (ఆది) హత్య చేశాడా అని అనుకున్నానని,కానీ తమ అన్నే హత్య చేయించాడని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు.జగన్‌కు, అవినాశ్‌కు ఉన్న దరిద్రపు ఆలోచనలు తమకు లేవని ఆదినారాయణ రెడ్డి అన్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఎక్కడైనా నామినేషన్ వేసే పరిస్థితులు ఉన్నాయా?అని ప్రశ్నించారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం సజావుగా ఎన్నికలు జరిగేందుకు కృషి చేస్తోందన్నారు.గతేడాది జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పులివెందులలో తమకు 25 శాతం ఓట్లు వచ్చాయని, 25 శాతాన్ని 52 శాతంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.నియోజకవర్గంలోని యర్రబల్లె చెరువుకు సంబంధించి నీటిని నింపేందుకు 48 గంటల్లోనే పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు.ప్రజలు కచ్చితంగా తమను ఆదరిస్తారని అన్నారు.
