Share News

Sunitha Reddy: వివేకా హత్య గురించి జగన్‌కు అంతా తెలుసు

ABN , Publish Date - Aug 12 , 2025 | 03:56 AM

సౌమ్యుడు, ప్రజానాయకుడైన తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఇంట్లోనే అత్యంత కిరాతకంగా హత్య చేయడం గురించి తన సోదరుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అంతా తెలుసని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి స్పష్టం చేశారు.

Sunitha Reddy: వివేకా హత్య గురించి జగన్‌కు అంతా తెలుసు

  • కేసును రాజకీయంగా వాడుకుని వదిలేశారు

  • న్యాయం జాప్యం కాలేదు.. తిరస్కరణకు గురైంది

  • సుప్రీంకోర్టు పునర్విచారణకు ఆదేశించాలి

  • దర్యాప్తును నాటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది

  • సీబీఐ అధికారులపైనే తప్పుడు కేసులు పెట్టించింది

  • అసలు దోషులను గుర్తించకుండానే దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తేల్చేసింది

  • చార్జ్జిషీటులోనూ కీలకాంశాలు దాచింది

  • వివేకా కుమార్తె సునీతారెడ్డి వెల్లడి

అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సౌమ్యుడు, ప్రజానాయకుడైన తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఇంట్లోనే అత్యంత కిరాతకంగా హత్య చేయడం గురించి తన సోదరుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అంతా తెలుసని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి స్పష్టం చేశారు.నాన్న చనిపోయిన విషయం బాహ్య ప్రపంచానికి తెలియకముందే జగన్‌కు తెలుసన్నారు.ఈ విషయాన్ని మాజీ ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లం కూడా దర్యాప్తు సమయంలోనే వెల్లడించారని,సీబీఐ కూడా తెలంగాణ హైకోర్టుకు ఈ సంగతి నివేదించిందని గుర్తుచేశారు.అయితే ఆ కోణంలో సీబీఐ దర్యాప్తు చేయకుండా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.నాన్న హత్య కేసును జగన్‌ తన రాజకీయ లబ్ధికి వాడుకుని వదిలేశారని ధ్వజమెత్తారు.ఈ హత్య కేసులో న్యాయం జాప్యం కాలేదని.. తిరస్కరణకు గురైందని వాపోయారు.వివేకా హత్యపై పునర్విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును సోమవారం అభ్యర్థించారు. ‘సీబీఐ చార్జిషీటులో కీలకాంశాలు దాచిపెట్టింది. అసలు దోషులను గుర్తించకుండానే దర్యాప్తు పూర్తయిపోయినట్లు తేల్చేసింది. ఈ కేసులో పెద్ద కుట్ర దాగి ఉందని సుప్రీంకోర్టు గుర్తించింది.ఫలితంగానే హత్య కేసును 2022 నవంబరు 29న ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది’అని తెలిపారు. వివేకా 2019 మార్చి 15వ తేదీన హత్యకు గురయ్యారని,ఈ ఘటనను గుండెపోటుగా చిత్రిస్తూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భార్య భారతీరెడ్డి నడుపుతున్న ‘సాక్షి’చానల్‌ ప్రసారం చేసిందన్నారు.దీనినే వైసీపీ ముఖ్యనేతలు పలువురు వల్లెవేశారని.. అత్యంత హేయంగా వివేకాను నరికి చంపిన ఉదంతం బయటకు పొక్కకుండా గుట్టుగా దాచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.నాన్న గుండెపోటులో మరణించారన్న సమాచారంతో హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి పులివెందుల వెళ్లానని.. తన తండ్రి భౌతికకాయం రక్తగాయాలతో ఉండడం గమనించానని..శరీరంపై బ్యాండేజీ కట్టి ఉండడాన్ని కూడా చూశానని తెలిపారు.


తర్వాత ఈ హత్యను మరో రాజకీయ పక్షంపై రుద్దడానికి కుట్ర పన్నారని విమర్శించారు.వివేకా హత్య జరిగిన మరుసటి రోజున జగన్‌ పత్రికలో ఈ హత్యకు టీడీపీ నాయకులే బాఽధ్యులంటూ ఫుల్‌ పేజీలో ప్రచురించారని చెప్పారు. హత్యకు తెలుగుదేశం పార్టీ నేతలే కారణమంటూ జగన్‌ ఏపీ హైకోర్టులో కేసు వేశారని తెలిపారు.న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి హోదాలో ఆయన తనకు హామీ ఇచ్చారని..అయితే ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేస్తే ఎంపీ అవినాశ్‌రెడ్డి వైసీపీని వీడి మరో పార్టీలో చేరతారని తనతో చెప్పారని తెలిపారు. తాను హైకోర్టును ఆశ్రయించడంతో..2020 మార్చి 11వ తేదీన సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు.అయితే వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా దర్యాప్తునకు అడ్డుతగిలిందని ధ్వజమెత్తారు.ఏకంగా సీబీఐ అధికారులపైనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు తిరస్కరించారని చెప్పారు. తన తండ్రి హత్య విషయంలో న్యాయం చేయాలని ప్రతి తలుపూ తట్టానని సునీతారెడ్డి తెలిపారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు చేయాలని..పునర్విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. తన న్యాయపోరాటానికి అందరి మద్దతూ కావాలని కోరారు.

Updated Date - Aug 12 , 2025 | 03:57 AM