Share News

SC Commission Jawahar: సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుంటాం

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:25 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ వెల్లడించారు.

SC Commission Jawahar: సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుంటాం

  • రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌

కాకినాడ, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ వెల్లడించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడలో వీధి సుబ్రహణ్యం కుటుంబాన్ని టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.మనోజ్‌, రెవెన్యూ, సోషల్‌ వెల్ఫేర్‌, ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ఆయన పరామర్శించారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రీ ఇన్వెస్టిగేషన్‌ చేయడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటుందని జవహర్‌ తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయ బృందాన్ని సిద్ధం చేసిందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతోపాటు కుటుంబానికి న్యాయంగా రావాల్సిన అన్ని సదుపాయాలు అందేలా కమిషన్‌ కృషి చేస్తుందని జవహర్‌ తెలిపారు. అతని కుటుంబసభ్యులకు అందజేసిన నిరుపయోగమైన భూమి స్థానంలో జీవనోపాధి పొందేలా అనువైన స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వీధి సుబ్రహ్మణ్యం కేసు విషయంలో మొదటి నుంచి ఆ కుటుంబానికి అండగా నిలిచిన సామాజిక కార్యకర్త పిట్టా వరప్రసాద్‌ను జవహర్‌ అభినందించారు.

Updated Date - Jun 13 , 2025 | 05:26 AM