ఒత్తిడిని జయించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:41 PM
విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేలా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేలా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స హాల్‌లో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యల నివారణకు సంబంధించి సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ(డీఎల్‌ఎంసీ) ఏర్పాటు అంశంపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఆత్మహత్యలను నివారించేందుకు జిల్లా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ ద్వారా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి స్థాయిని అంచనా వేయవచ్చన్నారు. ఇలాంటి వారికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు అందించాల్సిన మద్దతు ఎంతో కీలకమన్నారు. ప్రతి కళాశాలలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు అవసరమైన సాయాన్ని అందించాలన్నారు. అలాగే క్యాంప్‌సలలో ర్యాగింగ్ వంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు, సహపాఠ్య కార్యకలాపాల వైపు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో పీఎస్సీ అండ్ కేవీఎస్సీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ, అదనపు ప్రభుత్వ న్యాయవాది వెంకటేశ్వర్లు, డీవీఈవో శంకర్‌నాయక్, బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.