Share News

Visakhapatnam: కేజీహెచ్‌లో కోలుకుంటున్న విద్యార్థినులు

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:31 AM

పచ్చకామెర్లతో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు క్రమంగా కోలుకుంటున్నారు.

Visakhapatnam: కేజీహెచ్‌లో కోలుకుంటున్న విద్యార్థినులు

  • మూడు షిఫ్టుల్లో వైద్య సేవలు.. కోలుకున్న ఎనిమిది మంది పార్వతీపురం ఆసుపత్రికి తరలింపు

విశాఖపట్నం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పచ్చకామెర్లతో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు క్రమంగా కోలుకుంటున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు తదితర లక్షణాలతో బాధపడుతున్న 51 మంది విద్యార్థినులను ఈ నెల 4న పార్వతీపురం ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. రక్తపరీక్షలు, ఆల్ర్టాసౌండ్‌ స్కానింగ్‌ నిర్వహించిన వైద్యులు విద్యార్థినులంతా పచ్చకామెర్లతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. వారికి అందించే వైద్య సేవలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది. మూడు షిప్టుల్లో వైద్య సేవలు అందించేందుకు వీలుగా వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిని నియమించారు. వ్యాధి తగ్గుముఖం పట్టిన ఎనిమిది మందిని మంగళవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. అయితే మరికొద్ది రోజుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో వారిని పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. కాగా పార్వతీపురం ఆస్పత్రి నుంచి మంగళవారం సాయంత్రం మరో ఏడుగురు విద్యార్థినులు కేజీహెచ్‌కు వచ్చారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 50 మంది బాలికలకు చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Oct 08 , 2025 | 05:33 AM