Bobbili: పిడిగుద్దులకు విద్యార్థి మృతి
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:38 AM
తొమ్మిదో తరగతి విద్యార్థిపై అదే తరగతి విద్యార్థి పిడిగుద్దులు గుద్దడంతో ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిందీ ఘటన.
దాడి చేసింది తొమ్మిదో తరగతి చదివే సహ విద్యార్థే
పాఠశాల ముగిశాక కోటలోకి రా అంటూ సవాల్
అలాగే వెళ్లడంతో దారుణం
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఘటన
బొబ్బిలి జూలై 14(ఆంధ్రజ్యోతి): తొమ్మిదో తరగతి విద్యార్థిపై అదే తరగతి విద్యార్థి పిడిగుద్దులు గుద్దడంతో ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిందీ ఘటన. బొబ్బిలిలోని రావువారి వీధికి చెందిన కార్తికేయ(14) స్థానిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బొబ్బిలి మండలం గున్నతోటవలసకు చెందిన బాలుడు కూడా అదే క్లాసులో చదువుతున్నాడు. వీరిద్దరూ ముందురోజు ఘర్షణ పడ్డారు. మాటామాటా పెరిగి ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. ‘స్కూలు విడిచిపెట్టిన తర్వాత కోటలోనికి వస్తే నీ సంగతి చూస్తా’ అంటూ కార్తికేయను ఆ విద్యార్థి హెచ్చరించాడు. చూసుకుందామని కార్తికేయ బదులిచ్చాడు. సోమవారం సాయంత్రం పాఠశాల ముగిశాక వీరిద్దరితోపాటు మరికొందరు విద్యార్థులు బొబ్బిలి కోటలోకి వచ్చారు. తోటి విద్యార్థుల సమక్షంలో కార్తికేయపై ఆ విద్యార్థి పిడిగుద్దులు కురిపించాడు. కోటలో పనిచేస్తున్నవారు గమనించి గట్టిగా మందలించారు. విద్యార్థులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడికి గురైన కార్తికేయ పది అడుగుల దూరం నడుచుకుంటూ వెళ్లి నేలపై కుప్పకూలిపోయాడు. కోటలోని ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, సీఐ కటకం సతీష్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన విద్యార్థితోపాటు ప్రత్యక్షసాక్షులుగా ఉన్న విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.