Share News

Medical Negligence: ఏయూలో విద్యార్థి మృతి

ABN , Publish Date - Sep 26 , 2025 | 04:49 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టల్‌లో ఓ విద్యార్థి సకాలంలో చికిత్స అందక గురువారం ఉదయం మరణించాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

 Medical Negligence: ఏయూలో విద్యార్థి మృతి

  • సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని విద్యార్థి సంఘాల ఆందోళన

  • వర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయింపు

  • వీసీ చాంబర్‌లోకి దూసుకెళ్లిన విద్యార్థులు

  • రాజీనామా చేయాలని డిమాండ్‌, నేడు బంద్‌కు పిలుపు

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టల్‌లో ఓ విద్యార్థి సకాలంలో చికిత్స అందక గురువారం ఉదయం మరణించాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పట్టించుకోని వైస్‌ చాన్సలర్‌ రాజశేఖర్‌ రాజీనామా చేయాలంటూ ఆయన చాంబర్‌లోకి దూసుకువెళ్లారు. ఈ ఆందోళన రాత్రి 7.30 గంటల వరకూ కొనసాగింది. శుక్రవారం యూనివర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘ నాయకులు పిలుపునిచ్చారు. వివరాలు.. విజయనగరానికి చెందిన వింజమూరి వెంకట సాయి మణికంఠ (25) యూనివర్సిటీలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతూ క్యాంప్‌సలోని శాతవాహన హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో బ్రష్‌ చేసుకోవడానికి వాష్‌రూమ్‌కు వెళ్లి జారి పడిపోయాడు. గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే యూనివర్సిటీ ఆవరణలో ఉన్న డిస్పెన్సరీకి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ను రప్పించారు. తనకు ఊపిరి అందడం లేదని, ఆక్సిజన్‌ పెట్టాలని మణికంఠ కోరాడు. అయితే అంబులెన్స్‌లో ఆ ఏర్పాట్లు లేకపోవడంతో అక్కడి నుంచి కింగ్‌ జార్జి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారు. వెంటనే ఆక్సిజన్‌ పెట్టి ఉంటే చనిపోయేవాడు కాదని తెలిపారు. మణికంఠ ఆక్సిజన్‌ అందకే చనిపోయాడని వైద్యులు చెప్పడంతో విద్యార్థులు వర్సీటీ ప్రధాన గేటు వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఆందోళనకు దిగారు.


సుమారు 18 సార్లు ఈ సమస్య వీసీ దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన పట్టించుకోలేదని, తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. మణికంఠ కుటుంబానికి న్యాయం చేయాలని, రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. వీసీ రాజశేఖర్‌ అక్కడికి వచ్చి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. విద్యార్థి నాయకులు దీనికి సంతృప్తి చెందకపోవడంతో సుమారు 50 మంది విద్యార్థులు వీసీ చాంబర్‌లోకి దూసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో వారిని ప్రొఫెసర్లు, పోలీసులు అడ్డుకొని వీసీకి రక్షణ కల్పించారు. విద్యార్థులు రాత్రి ఏడు గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మణికంఠకు నివాళి అర్పించారు.

Updated Date - Sep 26 , 2025 | 04:52 AM