Road Accident: విద్యార్థి భవిష్యత్తును చిదిమేసిన ఇసుక లారీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:15 AM
ఆ దంపతులు చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ.. ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కష్టపడి చదివించుకుంటున్నారు. అమ్మానాన్నలు పడుతున్న కష్టం చూస్తున్న ఆ చిన్నారి..
ప్రమాదంలో ఒక కాలు పూర్తిగా తొలగింపు,
వైద్య ఖర్చులూ భరించలేని స్థితిలో తల్లిదండ్రులు
గుంటూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఆ దంపతులు చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ.. ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కష్టపడి చదివించుకుంటున్నారు. అమ్మానాన్నలు పడుతున్న కష్టం చూస్తున్న ఆ చిన్నారి.. పెద్దయ్యాక వారిని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలన్న తాపత్రయంతో చదువులో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. ఈ క్రమంలో బడికి వెళ్లి ఇంటికి వస్తుండగా ఇసుక లారీ ఢీకొట్టడంతో ఓ కాలు కోల్పోయి దివ్యాంగుడిగా మారాడు. సోమవారం సాయంత్రం గుంటూరు శివారు గోరంట్లలోని పంచాయతీ ఆఫీసు రోడ్డులో ఈ ఘోరం జరిగింది. స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న తాడేపల్లి మోహన్‌సాయి శ్రీ చరణ్(14)ను ఇసుక లారీ మితిమీరిన వేగంతో వచ్ఛి ఢీకొంది. ఆస్పత్రిలో చేర్చగా బాలుడి ఎడమ కాలును పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం కుమారుడి వైద్యఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబం దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. దాతలు 63048 05670 నంబరులో సంప్రదించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.