Share News

Missing Student Case: ఫీజు కట్టలేదని ఫొటోలు తీశారు

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:49 AM

ఫీజు కట్టలేదని బయట నిలబెట్టి ఫొటోలు తీశారు. కాలేజీలో ఫీజుకోసం పెట్టే ఒత్తిడి తట్టుకోలేను, అవమానం భరించలేను. ఇక అక్కడ నేను చదవలేను. సారీ.. మమ్మీ, సారీ.. డాడీ ఇంటి నుంచి వెళ్లిపోతున్నా. చనిపోవాలని నిర్ణయించుకున్నా. అంటూ తల్లిదంద్రులకు లేఖ రాసి ఓ విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది...

Missing Student Case: ఫీజు కట్టలేదని ఫొటోలు తీశారు

  • ఆ అవమానం భరించలేకున్నా తల్లిదండ్రులకు కుమార్తె లేఖ

  • డీ-ఫార్మసీ విద్యార్థిని అదృశ్యం

  • అన్నమయ్య జిల్లాలో ఘటన

మదనపల్లె, జూలై 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఫీజు కట్టలేదని బయట నిలబెట్టి ఫొటోలు తీశారు. కాలేజీలో ఫీజుకోసం పెట్టే ఒత్తిడి తట్టుకోలేను, అవమానం భరించలేను. ఇక అక్కడ నేను చదవలేను. సారీ.. మమ్మీ, సారీ.. డాడీ. ఇంటి నుంచి వెళ్లిపోతున్నా. చనిపోవాలని నిర్ణయించుకున్నా.’’ అంటూ తల్లిదంద్రులకు లేఖ రాసి ఓ విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తూ.. పోలీసులను ఆశ్రయించారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం పట్టేంవాండ్లపల్లెకు చెందిన సూర్యనారాయణ, సుజాత దంపతుల ఏకైక కుమారై శ్వేతశ్రీ(21) ఓ కళాశాలలో డీ-ఫార్మసీ చదువుతోంది. తల్లిదండ్రులు పలమనేరులోని కోళ్లఫారంలో పనిచేస్తున్నారు. స్థానిక సీటీఎంలోని నేతాజీ కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్వేతశ్రీ రోజూ ఇంటి నుంచే కళాశాలకు వెళ్తోంది. డీ-ఫార్మసీ రెండో ఏడాదిలో కొంత ఫీజు బ్యాలెన్స్‌ ఉంది. దీంతో బ్యాలెన్స్‌ ఫీజు చెల్లించాలని శ్వేతశ్రీని.. కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. ఈ నెల 2న ఫీజు చెల్లించని విద్యార్థినులను బయట నిలబెట్టి ఫొటోలు తీశారని, కాలేజీ మానేస్తానని ఇంట్లో చెప్పింది. డబ్బులు కట్టేస్తామని వారు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, శుక్రవారం యఽథావిధిగా కళాశాలకు బయలుదేరిన శ్వేతశ్రీ.. ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసి అదృశ్యమైంది. సాయంత్రం కళాశాలకు వెళ్లి విచారిస్తే.. రాలేదని చెప్పారు. ఫీజు చెల్లించని విద్యార్థులను నిలబెట్టి ఫొటోలు తీశారని, ఆ అవమానంతోనే తమ కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు మదనపల్లె తాలూకా ఎస్‌ఐ గాయత్రి, సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శ్వేతశ్రీకి ఫోన్‌ చేయగా తిరుమలలో ఉన్నట్లు గుర్తించామన్నారు. మరోసారి ఫోన్‌చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చిందని చెప్పారు.

Updated Date - Jul 06 , 2025 | 03:52 AM