Assault on Student: దాడి చేసి.. ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టి
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:56 AM
విద్యార్థుల మధ్య మనస్పర్థలు ఒకరిపై విచక్షణారహితంగా దాడి చేసి.. ఏకంగా ఇస్ర్తీ పెట్టెతో శరీరంపై వాతలు పెట్టే వరకూ వెళ్లింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ఓ...
తూర్పుగోదావరి జిల్లాలో ఓ విద్యార్థికి తోటి విద్యార్థుల చిత్రహింసలు
రాజోలు/రాజమహేంద్రవరం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల మధ్య మనస్పర్థలు ఒకరిపై విచక్షణారహితంగా దాడి చేసి.. ఏకంగా ఇస్ర్తీ పెట్టెతో శరీరంపై వాతలు పెట్టే వరకూ వెళ్లింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి, తల్లి తెలిపిన వివరాల మేరకు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన గుర్రం విన్సెంట్ ప్రసాద్ రాజమహేంద్రవరం మోరంపూడిలోని ఓ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడితో పాటు విశాఖపట్నం, గోకవరం, రాజోలుకు చెందిన పలువురు విద్యార్థులు కూడా ఆ స్కూల్‌కు చెందిన హాస్టల్‌లోని ఒకే రూమ్‌లో ఉంటారు. వీరిలో ఇద్దరు హాస్టల్‌లోని ఒక సీసీకెమెరాను తీసి తన బ్యాగులో పెట్టిన విషయాన్ని ప్రసాద్ ప్రిన్సిపాల్‌కు చెప్పాడు. దీంతో కక్ష పెంచుకున్న వారు ఈనెల 18న హాస్టల్ రూమ్‌లో ప్రసాద్‌ను విచక్షణారహితంగా కొట్టి.. ఇస్ర్తీ పెట్టెతో కాళ్లు, పొట్ట, చేతులపై వాతలు పెట్టారు. ఎవరికైనా చెబితే మళ్లీ కొడతామని బెదిరించారు. దీంతో బాధితుడు ఎవరికీ చెప్పకుండా బాధను భరిస్తూ వారం రోజులు గడిపాడు. ఈనెల 25న (సోమవారం) హాస్టల్‌కు వెళ్లిన తల్లి లక్ష్మీకుమారి.. కుమారుడి చేతిపై గాయాలు చూసి అడగ్గా.. వేడినీళ్లు పడ్డాయని ప్రసాద్ అబద్దం చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చారు. అనంతరం కుమారుడు పొట్టపై పెద్దగా కాలిన గాయం కనబడడంతో తల్లి నిలదీసింది. దీంతో ప్రసాద్ హాస్టల్‌లో జరిగిన ఘటన గురించి చెప్పాడు. బాధిత బాలుడిని మంగళవారం రాజోలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తల్లి ఫిర్యాదుతో డీఎస్ఈవో వాసుదేవరావు స్వయంగా స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. కాగా, దాడి ఘటనను గోప్యంగా ఉంచడం దారుణమని దళిత చైతన్యవేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ అన్నారు.