Student Assembly: విద్యార్థుల నోట.. అధ్యక్షా..
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:53 AM
పాఠశాల విద్యార్థులు అసెంబ్లీకి వెళ్లి ‘అధ్యక్షా..!’ అనేందుకు సిద్ధమ య్యారు! బడుల్లో పాఠాలు చదువుకొనేవారు..
26న అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’
రాజ్యాంగ దినోత్సవం నాడు కార్యక్రమం
అచ్చం అసెంబ్లీ తరహాలోనే కార్యకలాపాలు
వినూత్నంగా, వైవిధ్యంగా నిర్వహణకు ఏర్పాట్లు
175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా విద్యార్థులు
వీక్షించనున్న సీఎం చంద్రబాబు, మంత్రులు
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థులు అసెంబ్లీకి వెళ్లి ‘అధ్యక్షా..!’ అనేందుకు సిద్ధమ య్యారు! బడుల్లో పాఠాలు చదువుకొనేవారు.. తమ నియో జకవర్గాల్లోని సమస్యలపై గళమెత్తనున్నారు!! రాష్ర్టాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలూ చేయనున్నారు. ఇందుకు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో నిర్వహించనున్న ‘స్టూడెంట్ అసెంబ్లీ’ వేదిక కానుంది. కూటమి ప్రభుత్వం వినూత్నంగా, వైవిధ్యంగా ఈ కార్యక్ర మ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ హాలులోనే స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఆ హాలులో ఇతరులు కూర్చొనేందుకు నిబంధ నలు అంగీకరించకపోవడంతో.. అసెంబ్లీ ఆవరణలో ఈ మాక్ అసెంబ్లీ సెట్ వేస్తున్నారు. ఎమ్మెల్యేలతో జరిగే అసెంబ్లీకి ఏమాత్రం తీసిపోకుండా అచ్చం అలాగే ఈ కార్యక్రమం జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అసెంబ్లీలో జరిగినట్లుగానే..
ఈనెల 26న ఉదయం 9 గంటల సమయంలో స్టూడెంట్ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. తొలుత అందులో పాల్గొన్న విద్యార్థుల్లో ఒకరు ప్రొటెం స్పీకర్‌గా సభను ప్రారంభిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థి ఎమ్మెల్యేగా ఉంటారు. వారిలోనే అధికార, ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా కూడా విద్యార్థుల నుంచే వ్యవహరిస్తారు. అలాగే సెక్రటరీ జనరల్, మార్షల్స్‌గా కూడా విద్యార్థులే ఉంటారు. సాధారణ అసెంబ్లీలో జరిగి నట్లుగానే తొలుత ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. అనం తరం జీరో అవర్, ఆ తర్వాత రెండు బిల్లులపై చర్చ జరుగుతుంది. ఇవి కాకుండా ఏవైనా అంశాలపై చర్చి స్తారు. సుమారు 3 గంటల పాటు జరిగే విద్యార్థుల అసెంబ్లీని సీఎం చంద్రబాబు, మంత్రులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ అసెంబ్లీ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
సమానంగా అమ్మాయిలు, అబ్బాయిలు
స్టూడెంట్ అసెంబ్లీ కోసం పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి 8, 9, 10 తరగతులకు చెందిన 175 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచి వివిధ దశల్లో పోటీలు నిర్వహించారు. అసెంబ్లీలో సగం మంది అమ్మాయిలు, సగం మంది అబ్బాయిలు ఉంటారు. కాగా ఇప్పటి వరకూ ఝార్ఖండ్, రాజస్థాన్, హరియాణా, తెలంగాణ రాష్ర్టాల్లో స్టూడెంట్ అసెంబ్లీ జరిగింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం పక్కాగా అసెంబ్లీ కార్యకలాపాలను తలపించేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవడతాయనేది ప్రభుత్వం ఉద్దేశం. స్టూడెంట్ అసెంబ్లీ అనంతరం విద్యార్థులు అసలు అసెంబ్లీ హాలును సందర్శిస్తారు. సీఎంతో కలిసి గ్రూప్ ఫొటో దిగుతారు.