Share News

Student Assembly: నవంబరు 26న స్టూడెంట్‌ అసెంబ్లీ

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:16 AM

కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. స్టూడెంట్‌ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది...

Student Assembly: నవంబరు 26న స్టూడెంట్‌ అసెంబ్లీ

  • మార్గదర్శకాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. స్టూడెంట్‌ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం, ప్రభుత్వ విధానాల పట్ల అవగాహన కోసం విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహిస్తామని మంత్రి లోకేశ్‌ గతంలోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగా రాజ్యాంగ దినోత్సవం... నవంబరు 26న అమరావతి అసెంబ్లీ హాలులోనే స్టూడెంట్‌ అసెంబ్లీ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాల, మండల, నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించి నియోజకవర్గానికి ఒకరు చొప్పున 175 మందిని ఎంపిక చేస్తారు. వారికి శిక్షణ ఇచ్చి అమరావతిలో ఒక రోజు అసెంబ్లీ నిర్వహిస్తారు. వివిధ అంశాలపై విద్యార్థులు ఎమ్మెల్యేల తరహాలో అసెంబ్లీలో చర్చిస్తారు.

పోటీల తేదీలు ఇవే... ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో చదివే 8, 9, 10తరగతుల విద్యార్థులను ఎంపిక చేస్తారు. పాఠశాల స్థాయిలో వ్యాసాలు, ఉపన్యాసం, క్విజ్‌ల ద్వారా పోటీలు నిర్వహిస్తారు. ఈ నెల 24, 25 తేదీల్లో మండల స్థాయిలో, 29, 30 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో పోటీలు ఉంటాయి. రాష్ట్రస్థాయికి నియోజకవర్గానికి ఒకరిని ఎంపిక చేస్తారు. అసెంబ్లీ నియమావళిపై 25న విద్యార్థులకు శిక్షణనిచ్చి, 26న అసెంబ్లీ నిర్వహిస్తారు.

ఈ అంశాలపైనే పోటీలు...

పాఠశాల స్థాయిలో పోటీలు స్థానిక స్వీయ పరిపాలన, ఇష్టమైన స్వాతంత్య్ర సమరయోధుడు, స్వాతంత్రోద్యమంపై ఉంటాయి. మండల స్థాయిలో పౌర హక్కులు - విధులు, మానవ అభివృద్ధికి చట్టాల రూపకల్పన - అమలు, భారత స్వాతంత్య్ర పోరాటం అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. నియోజకవర్గ స్థాయిలో రాజ్యాంగ రూపకల్పన నేపథ్యం, వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ ద్వారా దేశాభివృద్ధి, భారత రాజ్యాంగంపై పోటీలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించడం, ప్రజాస్వామ్య పనితీరును తెలుసుకోవడం, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచడం, అనుభవపూర్వకంగా నేర్చుకోవడం ద్వారా పౌర విద్యను బలోపేతం చేయడం స్టూడెంట్‌ అసెంబ్లీ ముఖ్య లక్ష్యాలు.

Updated Date - Oct 23 , 2025 | 05:16 AM