Janardhan Rao and Jogi: జనార్దనరావు జోగిబలమైన మద్యం బంధం!
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:25 AM
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ మధ్య బలమైన బంధమే ఉంది..! ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని....
ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు
ఇద్దరూ దర్జాగా కూర్చున్న ఫొటోలు వైరల్
రమేశ్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు ఇప్పటికే అద్దేపల్లి వీడియో
వాట్సాప్ చాటింగ్ వివరాలూ బయటకు
మాజీ మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ)
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ మధ్య బలమైన బంధమే ఉంది..! ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సీఎం చంద్రబాబు కావాలని తనను ఇరికిస్తున్నారని జోగి రమేశ్ చెబుతున్నా.. మరోవైపు జనార్దనరావుతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నట్టుగా ఆధారాలు రోజుకొకటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఓ కార్యక్రమంలో జోగి రమేశ్, జనార్దనరావు పక్కపక్కనే దర్జాగా కూర్చుని ఉన్న ఫొటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘జనార్దనరావు, నేను ఒకే వీధిలో ఉండటం వల్ల పరిచయాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని నకిలీ మద్యం కేసులో నన్ను చేరుస్తున్నారు’ అని కొద్ది రోజుల కిందట జోగి రమేశ్ పలు సందర్భాల్లో చెప్పారు. జనార్దనరావు వీడియో విడుదల చేసిన తర్వాత ఆయనలో కలవరం మొదలైంది. తనకేం సంబంధం లేదన్నట్టు జగన్ మీడియా ముందు హడావుడి చేశారు. అయితే జోగి రమేశ్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు వీడియో ద్వారా అద్దేపల్లి జనార్దనరావు వెల్లడించాడు. ఆ తర్వాత జోగి రమేశ్‌తో వాట్సాప్ ద్వారా జనార్దనరావు చేసిన చాటింగ్ వివరాలు బయటపడ్డాయి. ఇప్పుడు జోగి రమేశ్ పక్కనే జనార్దనరావు కూర్చుని ఉన్న ఫొటోలు బయటకొచ్చాయి. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి జోగి నానా తంటాలు పడుతుంటే.. జనార్దనరావుతో ఉన్న నాటి బంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
దీపావళి తర్వాత జోగిపై ఫోకస్
నకిలీ మద్యం కేసులో ఇప్పటికే సుమారుగా 12 మందిని అరెస్ట్ చేశారు. వారంతా వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ముఖ్యంగా అద్దేపల్లి జనార్దనరావు, జగన్‌మోహనరావును విచారించడానికి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 22న తీర్పు రాబోతుంది. తనను జోగి రమేశ్ మోసం చేశారని ఇప్పటికే జనార్దనరావు వీడియోలో స్పష్టం చేశారు. పోలీసు విచారణలో జోగి రమేశ్‌కు సంబంధించి జనార్దనరావు చాలా తక్కువ విషయాలను వెల్లడించినట్టు విశ్వనీయంగా తెలిసింది. మిగిలిన విషయాలను కస్టడీలో రాబట్టడానికి ఎక్సైజ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ దశలోనే నకిలీ మద్యం తయారీపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో జోగి రమేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జనార్దనరావు త్వరలో వెల్లడించే వివరాలతో మరింత ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత జోగి రమేశ్ రెండుమూడు రోజులు మాత్రమే జనబాహుళ్యంలో కనిపించారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా మీడియా ముందుకు కాని, కార్యకర్తల ముందుకు కాని రాలేదు. జోగి అజ్ఞాతంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జనార్దనరావుతో జోగికి ఉన్న బంధాలకు సంబంధించి బయటపడుతున్న ఆధారాలు ఆయనలో కలవరాన్ని రేకెత్తిస్తున్నాయి.