Share News

భూముల మ్యుటేషన్లు జాప్యం చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:19 PM

భూముల రీ సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియలో జాప్యం చేస్తే సంబంధిత రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ హెచ్చరించారు.

భూముల మ్యుటేషన్లు జాప్యం చేస్తే కఠిన చర్యలు
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న జేసీ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ

జేసీ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ హెచ్చరిక

చింతూరు డివిజన్‌లో ఇళ్ల పట్టాల పరిశీలనపై అసంతృప్తి

పాడేరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియలో జాప్యం చేస్తే సంబంధిత రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ హెచ్చరించారు. కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని 22 మండలాల తహశీల్దార్లు, సర్వే విభాగం అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. భూముల మ్యుటేషన్లు, ఆధార్‌ సంబంధిత సమస్యలు, అన్నదాత సుఖీభవ డేటా సమస్యలు, భూముల రీ సర్వేపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పరమైన సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని గత వారమే చెప్పినా ఇప్పటికీ పరిష్కరించలేదని, ఇలా ఉంటే తహశీల్దార్లపై శాఖాపరమైన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు ఎక్కడైనా తహశీల్దార్ల మాట వినకపోతే, మెసేజ్‌ చేస్తే వెంటనే వారిని సస్పెండ్‌ చేస్తానని జేసీ తెలిపారు. అలాగే రెవెన్యూ, సర్వే సిబ్బందితో రెగ్యులర్‌గా సమీక్షలు నిర్వహించాలని తహశీల్దార్లకు సూచించారు. భూముల రీ సర్వే డేటా ఈ నెలాఖరుకు తహశీల్దార్‌ లాగిన్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ లాగిన్‌కు పంపించాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా 108 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఇళ్ల పట్టాలు పునఃపరిశీలన చేయాలన్నారు. చింతూరు రెవెన్యూ డివిజన్‌లోని ఎటపాక, కూనవరం, చింతూరు. వీఆర్‌ పురం మండలాల్లో ఇళ్ల పట్టాల పరిశీలన ప్రక్రియ సక్రమంగా చేపట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వరదల నేపథ్యంలో జలపాతాల వద్దకు పర్యాటకులను అనుమతించవద్దన్నారు. కంట్రోల్‌ రూమ్‌లు సక్రమంగా పని చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చింతూరు డివిజన్‌లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని, అవసరమైన చోట సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పాడేరు, చింతూరు సబ్‌ కలెక్టర్లు శౌర్యమన్‌ పటేల్‌, అపూర్వ భరత్‌, సర్వే విభాగం ఏడీ దేవేంద్రుడు, జిల్లాలోని 22 మండలాల తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

పెండింగ్‌ పెన్షన్‌ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాలి

లబ్ధిదారులకు చెల్లించగా మిగిలిన సామాజిక పెన్షన్ల సొమ్మును విధిగా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ ఆదేశించారు. జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పెండింగ్‌ పెన్షన్ల సొమ్మును సచివాలయాల పరిధిలోని వెల్పేర్‌ అసిస్టెంట్ల నుంచి పక్కాగా రికవరీ చేయాలన్నారు. లబ్ధిదారులకు అందించని సొమ్మును తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలన్నారు. స్త్రీ నిధిలో భాగంగా అందించిన రుణాల రికవరీని వేగవంతం చేయాలన్నారు. అర్హత కలిగిన 10,686 మహిళా సంఘాలకు రుణాలు అందించాలని, దీనిపై బ్యాంకు అధికారులతో చర్చించి రుణాలు మంజూరు చేయించాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చిన్ననీటి పారుదల శాఖకు 155 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు రూ.20 కోట్లు మంజూరు చేశామని, వాటి పనులు నవంబరు నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో సమీపంలో ఉన్న పాఠశాలల నుంచి టీచర్లను సర్దుబాటు చేశామన్నారు. సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్నది?, లేనిది? ఏటీడబ్ల్యూవోలు పరిశీలించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి ఐటీడీఏ పీవోలకు నివేదించాలన్నారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని, పాఠశాలల్లో 98 శాతం అటెండెన్సు ఉండాలన్నారు. స్థానికంగా సీట్లు ఖాళీలు లేకపోతే సమీపంలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని, పాఠశాలల భద్రతా ఆడిట్‌ వేగంగా పూర్తి చేయాలని ఎంఈవోలను ఆదేశించారు. మార్గదర్శి రిజిస్ర్టేషన్‌, అర్హులైన బంగారు కుటుంబాలన్నింటినీ నమోదు చేయాలన్నారు. తాగునీటి వనరులను క్లోరినేషన్‌ చేయాలని, దోమల మందు పిచికారీ పనులు సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి హామీ వేతనదారులకు కనీస వేతనాలు అందించే విధంగా పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు కె.సింహాచలం, అపూర్వభరత్‌, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ క్రాంతికుమార్‌, డీఈవో పి.బ్రహ్మాజీరావు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్‌, డ్వామా పీడీ విద్యాసాగర్‌, చిన్ననీటి పారుదల శాఖ డీఈఈ నాగేశ్వరరావు, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఏటీడబ్ల్యూవోలు, ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు, వెలుగు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:19 PM