Share News

Panchayat Raj: విధులు నిర్లక్ష్యం చేస్తే వేటే

ABN , Publish Date - Nov 08 , 2025 | 05:07 AM

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో ప్రక్షాళన కొనసాగుతోంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు, వారి పనితీరుపైనా నిరంతరం పర్యవేక్షణ సాగుతోంది.

Panchayat Raj: విధులు నిర్లక్ష్యం చేస్తే వేటే

  • పదోన్నతులిచ్చినంత వేగంగానే తప్పు చేసిన వారిపై చర్యలు

  • స్వర్ణ పంచాయతీలో నిర్లక్ష్యం చేసిన 26 మంది కార్యదర్శుల సస్పెన్షన్‌

  • సిబ్బందిపై ఉన్నతాధికారుల డేగకన్ను

మిగతా శాఖల కంటే భిన్నంగా పదోన్నతుల ప్రక్రియ చేపట్టి తమ శాఖలో 10 వేల మంది ఉద్యోగులకు ఒకేసారి ప్రమోషన్‌ కల్పించిన పంచాయతీరాజ్‌శాఖ అందరి ఆదరాభిమానాలను పొందింది. అదే సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగుల విషయంలో అంతే కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 26 మంది పంచాయతీ కార్యదర్శులపై ఒకేసారి సస్పెన్షన్‌ వేటు వేసింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో ప్రక్షాళన కొనసాగుతోంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు, వారి పనితీరుపైనా నిరంతరం పర్యవేక్షణ సాగుతోంది. గత 48 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా సంస్కరణలు చేపట్టారు. పనిలో నిబద్ధతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. పలు దఫాలు సమావేశాలు నిర్వహించి పదోన్నతులు కల్పించారు. దీనికిగాను డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు రేయింబవళ్లు పనిచేశారు. పదోన్నతులకు ఉన్న అడ్డంకులను అధిగమించి పదోన్నతుల ప్రక్రియను ముగించారు. ఫలితంగా సుమారు 10 వేల మందికి పదోన్నతులు కల్పించారు. ఇప్పటికే చాలా మందికి పదోన్నతులు దక్కాయి. మరి కొంత మందికి మరో నెలలోపు ప్రమోషన్లు దక్కనున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడాన్ని ఉపేక్షించడం లేదు. ఎంతవారైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్ల వేటు వేస్తున్నారు.


డేటా సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ పంచాయతీల పోర్టల్‌ తీసుకురావడం ద్వారా గ్రామ పంచాయతీల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని భావించింది. ఈ పోర్టల్‌ అభివృద్ధి చేయడం ద్వారా గ్రామ పంచాయతీల ఆదాయం రూ.450 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెరిగింది. దీంతో గ్రామాల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది. అయితే, ఈ పోర్టల్‌కు అవసరమైన డేటా సేకరణలో పంచాయతీ కార్యదర్శులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సుమారు 3 వేల పంచాయతీలకు సంబంధించిన కార్యదర్శులు ఒక ఫోన్‌ నెంబర్‌ను వందల కొద్దీ అసె్‌సమెంట్‌లకు లింక్‌ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ పోర్టల్‌ తీసుకొచ్చిందో ఆ లక్ష్యం మరుగునపడింది. పైగా కీలక సమాచారం ఆయా కుటుంబాలకు చేరే పరిస్థితి లేకుండా పోయింది. పోర్టల్‌ ప్రారంభించి పౌరులకు స్థిరాస్తుల పన్నుల సమాచారాన్ని సందేశం రూపంలో తెలియజేయాల్సి ఉంది. అయితే, ఆయా పంచాయతీలలోని కొందరు కార్యదర్శులు వారికి అప్పగించిన బాధ్యతలను విస్మరించారు. దీంతో నిర్లక్ష్యంగా వహించిన కార్యదర్శులపై వేటు వేయకపోతే శాఖను గాడిలో పెట్టలేమని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే 26 జిల్లాల్లో అత్యంత నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్న కార్యదర్శులను ఎంపిక చేసి 26 మందిపై వేటు వేశారు. మరి కొందరిపై కూడా సస్పెన్షన్‌ వేటు వేయాలని అధికారులు భావిస్తున్నారు.


ప్రత్యేక సెల్‌తో పనితీరు అంచనా

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్‌లో సుమారు పది మందికి పైగా ఎంపీడీవో స్థాయి అధికారులు పలు పథకాలపై ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. కమిషనర్‌ ఈ విభాగానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి ప్రతి పథకం అమలు తీరుపై నిశితంగా గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా వెంటనే ఈ విభాగానికి తెలిసేలా ప్రత్యేక సెల్‌ పనిచేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు ఎక్కడ అవినీతికి పాల్పడినా, అప్పగించిన బాధ్యతలు సకాలంలో చేపట్టకపోయినా కమిషనర్‌కు సమాచారం వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో ఈ శాఖలో పారదర్శకత పెంచేందుకు, గ్రామీణులకు సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Nov 08 , 2025 | 05:13 AM