Share News

Minister Anitha: తప్పుడు పోస్టుల దండుపాళ్యం బ్యాచ్‌పై కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:29 AM

సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురి చేసే దండుపాళ్యం బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు...

Minister Anitha: తప్పుడు పోస్టుల దండుపాళ్యం బ్యాచ్‌పై కఠిన చర్యలు

  • అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలకు ప్రత్యేక చట్టం తెస్తాం

  • అమరావతి ఎక్కడ మునిగింది?

  • వైసీపీ దుష్ప్రచారంపై హోం మంత్రి అనిత ఫైర్‌

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురి చేసే దండుపాళ్యం బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్లు ఆమె స్పష్టం చేశారు.మంగళవారం ఆమె అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదు.కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేయడంతో వైసీపీ తట్టుకోలేకపోతోంది.అమరావతి రాజధానిగా కొనసాగాలని లక్షలాది మంది మహిళలు బయటకు వచ్చి పోరాడారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక సోషల్‌ మీడియాలో విషం చిమ్ముతూ వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే గాక అభద్రతా భావానికి గురిచేస్తున్నారు.ముఖ్యంగా అమరావతిపై వైసీపీ అనుకూల మీడియా, సోషల్‌ మీడియాలో మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ, వైసీపీ నేతలతోపాటు, సాక్షి మీడియా, వైసీపీ సోషల్‌ మీడియా దుష్ప్రచారం చేస్తోంది.అమరావతి ఎక్కడ మునిగింది? అమరావతి మునిగిపోతే నేను ఇక్కడ ఎలా ప్రెస్‌ మీట్‌ పెడతాను? మీరందరూ ఇక్కడికి ఎలా వస్తారు? కొన్ని ప్రాంతాల్లో పునాదులు తీసిన చోట నీళ్లు రావా? దాన్ని బూచిగా చూపించి అసత్య ప్రచారాలు చేస్తారా?’ అని అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై రాజద్రోహం కింద కేసులు పెట్టాలన్నారు.


తప్పుడు పోస్టుల ద్వారా ప్రజల్లో ఆందోళన సృష్టించే దండుపాళ్యం బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ వేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నామని చెప్పారు. ‘ప్రకాశం బ్యారేజీలో ఒక్క గేటుకు చిన్న రిపేర్‌ వస్తే రాద్ధాంతం చేశారు. జగన్‌ సొంత పత్రికలో రోజుకో నకిలీ వార్తలు రాస్తున్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.

Updated Date - Aug 20 , 2025 | 04:30 AM