Minister Ramprasad Reddy: స్త్రీశక్తి సూపర్ సక్సెస్
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:08 AM
మహిళలకు కూటమి ప్రభుత్వం కానుకగా అందిస్తున్న ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం..
భారం కాదు.. బాధ్యతగా భావిస్తున్నాం!
మహిళలకు స్మార్ట్ కార్డుల యోచన: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ (బస్‌స్టేషన్), ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మహిళలకు కూటమి ప్రభుత్వం కానుకగా అందిస్తున్న ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’ని భారం అనుకోవటం లేదని, తమ బాధ్యతగా భావిస్తున్నామని రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి అన్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకం సూపర్ సక్సెస్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ సమావేశపు హాలులో ఆర్టీసీ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష, సక్సెస్ మీట్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం ద్వారా ఆరు రోజుల్లో 65 లక్షల మందికి పైగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేయటంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషి చేశారన్నారు. ఉచిత బస్సు లబ్ధిదారులకు త్వరలో స్మార్ట్ కార్డులు అందించే యోచనలో ఉన్నామన్నారు. కొందరు కువిమర్శలు చేస్తున్నారని, పథకం అమలులో నిజంగా ఏవైనా లోపాలుంటే సద్విమర్శలు చేస్తే తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో కూడా ఉచిత బస్సు అమలు చేస్తున్నామని, సరిహద్దు గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు.